చింత‌కాయ‌ల‌కు ఇది చంద్ర‌బాబు కొట్టిన గంట‌!

పొమ్మ‌న‌లేక పొగ‌బెట్ట‌ట‌మంటే ఇదే స్వ‌లాభ‌మో.. రాష్ట్ర ప్ర‌యోజ‌న‌మో తేల్చుకోవాల్సిన త‌రుణం మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడుకు వ‌చ్చేసింది. విశాఖ భూకుంభ‌కోణం దీనికి కీల‌కంగా మారుతోంది. తాను తీసుకువ‌చ్చిన వ్య‌క్తికి పెద్ద‌పీట వేస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి చింత‌కాయ‌ల‌ను క‌లచివేస్తోంది. పార్ల‌మెంటుకు వెళ్ళాల‌ని కోరిన‌ప్పుడు..గంటా శ్రీ‌నివాస‌రావును చంద్ర‌బాబుకు ఎందుకు ప‌రిచ‌యం చేశానా అనే యోచ‌న‌లో ప‌డేసింది. ముందొచ్చిన చెవుల‌కంటే వెన‌కొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా గంటా శ్రీ‌నివాస‌రావు గురువుకే చుక్క‌లు చూపిస్తున్నారు. విలేక‌రిగా జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీ‌నివాస‌రావు ఆపై పోర్టులో స్టీవార్డ్‌గా చేరి, క్ర‌మేపీ ఎదిగారు. ఆర్థికంగానూ బ‌ల‌ప‌డ్డారు. కొద్దోగొప్పో ఉన్న ఆంగ్ల ప‌రిజ్ఞానం ఆయ‌న్ను చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేసేలా చేసింది. పార్లమెంటుకు వెళ్ల‌డాన్ని త‌ప్పించుకోవ‌డానికి అయ్య‌న్న పాత్రుడు ప్ర‌త్యామ్నాయంగా గంటా శ్రీ‌నివాస‌రావును రాజ‌కీయాల్లోకి తెచ్చారు. ఆ గంటా శ్రీ‌నివాస‌రావే అయ్య‌న్న‌పాత్రుడు పీఠం కింద‌కు నీళ్లు తెస్తున్నారు.

విశాఖ భూకుంభ‌కోణంలో దాదాపు 5 వేల‌ ఎక‌రాలున్నాయ‌ని గంటా మ‌ద్ద‌తుతో ఇది సాగుతోంద‌నేది అయ్య‌న్న‌పాత్రుడు ఆరోప‌ణ‌. అక్క‌డినుంచి గంటా చురుగ్గా పావులు క‌దిపారు. త‌న వారితోనూ విమ‌ర్శ‌లు చేయిస్తూ… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. అందులో సంత‌కం లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఆయ‌న లెట‌ర్ హెడ్‌పై మీడియాకు లీకైన ఆ లేఖ‌లో చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు పార్టీ ప్ర‌తిష్ట దెబ్బ‌తీసే విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆరోపించారు. ఒక ప‌క్క‌న మీరు విశాఖ ప్ర‌తిష్ట ఇనుమ‌డించేలా కృషి చేస్తోంటే.. స్వ‌యంగా మంత్రే పార్టీకి మ‌చ్చ తెచ్చేలా ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌మంజ‌స‌మా అని నిష్టుర‌మాడారు. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు హుదుద్ తుపాను అనంత‌రం చేసిన కృషిని కొనియాడారు.

నిన్న విశాఖ వెళ్ళిన చంద్ర‌బాబు అందుకు త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. విశాఖ‌లో భూ క‌బ్జా అంశంపై బ‌హిరంగ విచార‌ణకు ముందు రోజు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ ద‌ర్యాప్తు నుంచి కొన్ని గ్రామాల‌ను మిన‌హాయించాల‌ని గంటా శ్రీ‌నివాస‌రావు ముఖ్య‌మంత్రిని కోరారంటున్నారు. అదే జ‌రిగితే..భూ కుంభ‌కోణాన్ని వంద‌డుగుల లోతులో పాతిపెట్టేసిన‌ట్లే. ఇక ఎప్ప‌టికీ నిజాలు వెల్ల‌డి కావు. చంద్ర‌బాబు, చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు, గంటా శ్రీ‌నివాస‌రావు… ఇలా ముగ్గురూ టీడీపీ ప్ర‌తిష్ట కోస‌మే పోరాడుతున్నారు. ఇక్క‌డ విచిత్ర‌మేమిటంటే.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చింత‌కాయ‌లను త‌ప్పించ‌డానికీ లేదా నిస్తేజుణ్ణి చేయ‌డానికీ ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇదే నిజ‌మైతే.. రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల దృష్టిలో జ‌గ‌దంబా సెంట‌ర్‌లోని గ్రంథాల‌య భ‌వ‌నాన్ని కూల‌గొట్టించిన వైనం, ఆశీల‌మెట్ట‌లోని కార్పొరేష‌న్ ఉద్యోగుల క్వార్ట‌ర్ల స్త‌లాల క‌బ్జాకు కాచుక్కూర్చున్న ప్ర‌ముఖుడిపై ఎందుకు ప‌డ‌లేదు? అలా వివాదాన్ని సెటిల్ చేసుకోవ‌డానికి చింత‌కాయ‌ల ఎందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు? ఏదైనా ఆలోచ‌న ఆయ‌న మ‌దిలో ఉందా? ఉంటే అదేమిటి? ఆయ‌నెటు చూస్తారు? ఆయ‌నెటూ చూడ‌డానికి అవ‌కాశం లేదు. ఉన్న‌వి రెండే ఆప్ష‌న్లు. ఒక‌టి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌, రెండు బీజేపీ.. ఎటూ ఆయ‌న బీజేపీ అసెంబ్లీ ప‌క్ష నేత విష్ణుకుమార‌రాజుతో స‌న్నిహితంగానే ఉంటున్నారు క‌నుక‌.. చింత‌కాయ‌ల త్వ‌ర‌లోనే ఏదో నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌థ్యం. ఎందుకంటే ఒక ఒర‌లో రెండు క‌త్లులు ఇమ‌డ‌వు. అలాగే.. గురువుని మించిన శిష్యుడ‌ని గంటాను చూసి, పొంగిపోయే త‌త్త్వం చింత‌కాయ‌ల‌లో క‌నిపించ‌దు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.