తెలంగాణ రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తమకు అన్వయించుకుని తాము ఎంత బలంగా ఉన్నామో చెప్పుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ.. ఆరేడు నియోజకవర్గాల్లో తప్ప అన్ని చోట్ల తమదే ఆధిపత్యమని ప్రకటించారు. అంటే ఇప్పటిప్పుడు ఎన్నికలు జరిగితే ఓ ఇరవై సీట్లు ఎక్కువే తెచ్చుకుంటామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు కూడా అంతే. కాంగ్రెస్ పై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందని పంచాయతీ ఫలితాలతో నిరూపితమయిందని.. రెండున్నరేళ్లలో కేసీఆర్ సర్కార్ వస్తుందని చెబుతున్నారు. నిజానికి ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగానూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవు. గతానుభవాలు చెబుతున్న సత్యం కూడా ఇదే.
ప్రతి పంచాయతీకి ప్రత్యేక రాజకీయం -అదే హైలెట్
ప్రతి గ్రామ పంచాయతీ ఓ రాష్ట్రం లాంటిదే. అక్కడ వెయ్యి మందిఉన్నా.. జరిగే రాజకీయాలను ఎవరూ ఊహించలేరు. కేవలం తమ ఊరిపై పెత్తనం కోసం అక్కడి వారు వర్గాలుగా విడిపోయి ప్రయత్నం చేసుకుంటారు. వారిలో పార్టీల మద్దతు ఉన్నవారు ఉండవచ్చు. కానీ వారు అంతిమంగా ప్రచారం చేసేది…ఓట్లు అడిగేది పార్టీని చూపించి కాదు. కేవలం తమ వ్యక్తిగత ప్రాబల్యంతోనే ఓట్లు పొందుతారు. కానీ అధికార పార్టీకి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ పార్టీ నేత.. తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పథకాలు అందరికీ ఇప్పిస్తానని హామీ ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు సర్పంచ్ అయినా జరిగేదేమీ ఉండదని కొంత మంది అతనివైపు మొగ్గుచూపుతారు. అంతకు మించి ఓటర్లు ఆలోచించరు.
ప్రభుత్వ వ్యతిరేకత, సానుకూలత ఓట్లు కాదు !
పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రభుత్వ సానుకూలత, వ్యతిరేకతకు సంబంధించినవి కానేకావు. గ్రామస్థాయిలోని అంశాలతోనే వారు ఓట్లు వేస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత చూపించాలనుకుంటే అది అసెంబ్లీ ఎన్నికల్లోనే చూపిస్తారు. మన దేశంలో ఓటర్ చైతన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఓటేస్తూంటారు. అంటే అన్ని ఆలోచించుకునే ఓట్లేస్తారు. గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడించి లేదా గెలిపించి తమ వ్యతిరేకత, అనుకూలత చూపాలని అనుకోరు.
బీఆర్ఎస్, వైసీపీకి ఇంకా బాగా తెలుసు !
స్థానికసంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించకూడదో అలా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ కూడా భారీ విజయాలు నమోదు చేసింది. మున్సిపాలీటీల్లో అయితే విపక్ష పార్టీలకు ఒక్క సీటు రాకుండా కైవసం చేసుకున్నారు. ఇలాంటి ఎన్నికలు నిర్వహించినా.. నిర్వహించకపోయినా ఒక్కటే. ప్రజలకు స్వేచ్చగా ఓటేసే అవకాశాన్ని కల్పించకపోతే ప్రజలు ఆగ్రహిస్తారు. అలా స్థానిక సంస్థల్లో మొత్తం తమ వారిని పెట్టుకుని ఆయా పార్టీలు సాధించిన గొప్ప ఏమీలేదు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఘోరంగా ఓడిపోయారు. అంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదని అర్థం అయిపోతుంది.
