తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు తన ఫోన్ డేటా మొత్తాన్ని సిట్ కు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐ క్లౌడ్ పాస్ వర్డ్ మర్చిపోయారని ఆయన కోర్టుకు చెప్పారు. కానీ పాస్ వర్డ్ రీసెట్ చేసి సిట్ కు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు తాను ఉపయోగించిన ఫోన్, ల్యాప్ ట్యాప్లలో సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేశారు. అది విచారణ జరుగుతున్న సమయంలోనే జరిగింది. ఇలా చేయడం దర్యాప్తును ప్రభావితం చేసే కుట్రతోనే జరిగిందని ప్రభుత్వం వాదిస్తోంది.
ఎస్ఐబీ చీఫ్ గా ప్రభాకర్ రావు చేసింది.. కేవలం ట్యాపింగ్ పనేనని పోలీసు వర్గాలందరికీ తెలుసు. ఆయన ఫోన్ కే అత్యధిక సమాచారం వెళ్లేది. ఆయన ల్యాప్ ట్యాప్, ఫోన్లలో కీలక సమాచారం ఉంటుంది. పూర్తిగా ఎరేస్ చేసినా మళ్లీ రీట్రీవ్ చేసే టెక్నాలజీ పోలీసుల వద్ద ఉంటుంది. అందుకే ఆయన కంగారు పడుతున్నారు. అయితే బెయిల్ క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉండటంతో ఆయన పాస్ వర్డ్ రీసెట్ చేసి ఇచ్చేందుకు అంగీకరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును లాజికల్ గా ముగించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సమాచారాన్ని చాలా వరకూ సేకరించారు. సాంకేతికంగా నిరూపించడం కష్టం. అందుకే ఇతర మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ట్యాపింగ్ చేసిన ఆడియో క్లిప్పులు.. ఇతర సమాచారం అంతా ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ లో ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమాచారాన్ని సేకరించగలిగితే.. కేసులో లాజికల్ కంక్లూడింగ్ సాధ్యమవుతుంది. లేకపోతే కష్టమవుతుంది.