తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో. ఏం చేయాలన్నదానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారికి నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. వారు ఇచ్చే సమాధానలేంటి.. ఆ సమాధానంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది స్పీకర్ నిర్ణయం. అయితే ఇక్కడ స్పీకర్ అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు కానీ.. పార్టీ విధానం ప్రకారమే ఆయన ముందడుగు వేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు రేవంత్ వారి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు ?
పార్టీ మారలేదని చెప్పాలనుకుంటున్నారా?
ఆ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లో చేరామని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశామని.. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కాదని అంటున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఇదే వాదన సుప్రీంకోర్టులోనూ వినిపించారు. ఇప్పుడు స్పీకర్ జారీ చేసే నోటీసులకు కూడా అదే సమాధానం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం. ప్రకారం.. విప్‌ను ధిక్కరించినప్పుడు.. స్వచ్చందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడే అనర్హతా వేటు పడుతుంది. ఇక్కడ వీరు ఈ రెండూ చేయలేదు.
సాంకేతికంగా వారిని స్పీకర్ కాపాడవచ్చు కానీ.. !
అంటే టెక్నికల్‌గా ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నదానికి ఆధారాలు ఉండవు కాబట్టి.. వారిని అసెంబ్లీ అధికారిక రికార్డుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తారు కాబట్టి వారిపై అనర్హతా వేటు వేయకపోవచ్చు. కానీ చట్టం కళ్లు కప్పడానికి ఇది బాగానే ఉంటుంది. కానీ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. వారు పార్టీ మారారని ఇప్పుడు అనధికారికంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని తెలుసు. కానీ పదవిపై అనర్హతా వేటు పడుతుందన్న భయంతో.. .ఇలా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకోవడం మాత్రం వారి నైతికతను ప్రశ్నార్థకం చేస్తుంది.
సుప్రీంకోర్టు తీర్పును స్పీకర్ సవాల్ చేస్తారా ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్ల చోరీ యాత్రలో పాల్గొనేందుకు బీహార్ వెళ్లనున్నారు. ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకుని అక్కడ న్యాయనిపుణులతో సమావేశం కానున్నారు. ఫిరాయింరు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పాటించాలా వద్దా అన్నదానిపై.. అలాగే బీసీ రిజర్వేషన్లపైనా చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ కు గడువు నిర్దేశించడం రాజ్యాంగపరంగా కోర్టు తన అధికార పరిధిని ఉల్లంఘించినట్లేనని రేవంత్ భావిస్తున్నారు. ఈ దిశగా అప్పీల్ లేదా.. మరో దారి ఏదైనా ఉందేమో న్యాయనిపుణులతో మాట్లాడే అవకాశం ఉంది.