తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు తాము ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులమేనని స్పీకర్‌కు నివేదించడం, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికే కాకుండా, క్షేత్రస్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు కూడా అద్దం పడుతోంది. కేవలం సాంకేతికంగానే కాకుండా, రాజకీయంగా కూడా వీరు కాంగ్రెస్ వైఖరితో విసిగిపోయి మళ్లీ సొంత గూటికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
బీఆర్ఎస్ను గెలిపించాలన్న మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌లో చేరడం తాను చేసిన ఒక తప్పటడుగు అని ఆయన బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తన నియోజకవర్గానికి గానీ, వ్యక్తిగతంగా తనకు గానీ కనీసం వెంట్రుక వాసి కూడా ప్రయోజనం కలగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గులాబీ జెండా పట్ల కృతజ్ఞతగా ఉండాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన తన అనుచరులకు పిలుపునివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరికొంత ఎమ్మెల్యేలదీ అదే దారి
మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇదే తరహా ధోరణిని ప్రదర్శిస్తున్నారు. గతంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరిన కొద్ది రోజులకే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరినట్లుగా ప్రచారం చేయించుకున్నారు. తాను ఎప్పుడూ బీఆర్ఎస్ను వీడలేదని, కేవలం అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిశానని ఆయన స్పష్టం చేస్తున్నారు. స్పీకర్ ముందు కూడా తాము పార్టీ మారలేదని వాదించడం ద్వారా, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారనేది స్పష్టమవుతోంది.
రివర్స్ ఫిరాయింపులు ఖాయమే!
ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని అంశాలుగా మారాయి. చేర్చుకున్న ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరిస్తుండటం, ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునివ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా, ప్రజల్లో ఈ ఎమ్మెల్యేల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నప్పటికీ, వీరు మళ్లీ బీఆర్ఎస్కు దగ్గరవ్వడం ఆ పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. కానీ వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.


