ఇక తెలంగాణలో జాతీయవాదం వర్సెస్ తెలంగాణవాదం..!

భారతీయ జనతా పార్టీ తరహా రాజకీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి కౌంటర్ పాయింట్లు రెడీ చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో.. అసెంబ్లీ ఎన్నికల్లో పునాదులు కూడా లేని పార్టీ… పార్లమెంట్ కు వచ్చే సరికి.. సవాల్‌గా నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో… బీజేపీ ఇమేజ్ తెలంగాణలో అమాంతం పెరిగిపోయిందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు హడావుడి ప్రారంభించారు. దీంతో.. బీజేపీకి కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితిలో టీఆర్ఎస్ అగ్రనేతలు పడిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విధాన పరంగానే బీజేపీని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే.. తొలి సారి.. బీజేపీ మార్క్ రాజకీయాలపై.. ఓ తటస్థ వేదికపై.. తీవ్రంగా స్పందించారు.

రాజకీయాలకు సంబంధం లేని సభలో.. కేటీఆర్ బీజేపీ మార్క్ రాజకీయాలను టార్గెట్ చేశారు. ప్రసంగంలో టీఆర్ ఎక్కడా నేరుగా రాజకీయ ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిపై మాత్రం.. ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజల విశ్వాసాలు, అభిప్రాయాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. తమతో నాతో ఉంటే దేశభక్తుడు.. కాకపోతే ఉంటే దేశద్రోహి అనే పరిస్థితులున్నాయని.. ఆవేద వ్యక్తం చేశారు. తాను చెప్పిన విషయాన్ని భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి చెబుతున్నవే అయినప్పటికీ.. కేటీఆర్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ చివరిలో మాత్రం..మహాత్ముడినే అవమానించిన ప్రజ్ఞాసింగ్‌.. వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పారు.

టీఆర్ఎస్ .. బీజేపీని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదని అంచనాకు వచ్చింది. అయితే.. టీడీపీ , కాంగ్రెస్‌లను ఎదుర్కొన్నట్లుగా.. బీజేపీపై రాజకీయ పోరాటం చేస్తే.. మిస్ ఫైర్ అవుతుందనే అంచనా.. టీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో ఉంది. ఎందుకంటే.. బీజేపీది జాతీయ వాద రాజకీయాలు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై.. ఏ మాత్రం ప్రశ్నలు వేసినా.. వారిపై.. దేశద్రోహి ముద్ర వేస్తున్న పరిస్థితులు సోషల్ మీడియాలో ఉన్నాయంటున్నారు. ప్రజలపై ఇదో తరహా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగన్న అభిప్రాయం.. ఇతర పార్టీల నేతల్లో ఏర్పడుతోంది. దీన్ని తగ్గించడానికి కేటీఆర్..కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. బీజేపీ విధానాలను వ్యతిరేకించినంత మాత్రాన.. వారేమీ దేశ వ్యతిరేకులు కాదనే భావనను.. ప్రజల్లోకి పంపాలని..కేటీఆర్ వ్యూహం కావొచ్చటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో … భారతీయ జనతా పార్టీ రాజకీయాలను ఎదుర్కోవడం…టీఆర్ఎస్‌కు అంత తేలిక కాదు. కానీ కేటీఆర్ మాత్రం.. మరో వైపు నుంచి ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com