జనాభా తగ్గిపోతోందని.. పెంచాలని సీఎం చంద్రబాబు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో పిల్లల విషయంలో ఏమైనా ఆంక్షలు, రూల్స్ ఉంటే తొలగిస్తున్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే.. పోటీ చేయడానికి అనర్హత లేదన్న నిబంధనను తొలగించారు. చట్టం అసెంబ్లీలో ఆమోదించారు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు.
లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ను ఎత్తివేయాలని నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ను తొలగించాలని ఆమోదం తెలిపింది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను ఎత్తివేయడంతో, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేసే అవకాశం కలుగుతుంది.
1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు. ఈ నిబంధన పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)లో భాగంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేయడం ద్వారా అభ్యర్థులకు వెసుబాటు కల్పించింది. కేబినెట్ నిర్ణయం మేరకు ముందుగా ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు.