తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనల ఉల్లంఘనలపై రెరా కొరడా ఝుళిపించింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, స్వర్గసీమ అమేయ, నవనమి ఎలివేట్, వర్టెక్స్ విరాట్ , తిరుమల హిల్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ పూర్తికాకముందే ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రకటనలు ఇవ్వడం ,నిబంధనలకు విరుద్ధంగా మార్కెటింగ్ చేయడంపై అథారిటీ సీరియస్ అయింది.
రియల్ ఎస్టేట్ నియంత్రణ , అభివృద్ధి చట్టం, 2016 ప్రకారం.. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థలాలు లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్టులను మార్కెటింగ్ చేసే ముందు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ పొందాలి. అయితే, ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండానే ప్రకటనలు ఇవ్వడం , నంబర్‌ను స్పష్టంగా కనిపించని రీతిలో చిన్న ఫాంట్ సైజులో ముద్రించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
మరికొన్ని ప్రాజెక్టులలో లేఅవుట్ అనుమతులు మాత్రమే ఉన్నప్పటికీ, వాటిని పూర్తి స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టులుగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు రెరా దర్యాప్తులో తేలింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పేర్లు, సరైన రిజిస్ట్రేషన్ వివరాలు లేని ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చట్ట ప్రకారం ప్రతి ప్రకటనలోనూ చెల్లుబాటు అయ్యే రెరా నంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించడం తప్పనిసరి.
అనుమతులు లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని కొనుగోలుదారులకు సూచిస్తూనే, నిబంధనలు అతిక్రమించే బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రెరా స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడులను ఆకర్షించడం చట్టరిత్యా నేరమని, దీనివల్ల భవిష్యత్తులో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అథారిటీ హెచ్చరించింది. ఎంత పెద్ద కంపెనీలు అయినా రెరా రిజిస్ట్రేషన్, అనుమతులు ఉంటేనే.. వినియోగదారులకు రక్షణ ఉంటుంది.
