కాళశ్వరం అవకతవకల విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును అనుసరించి చర్యలు తీసుకోవాలని, సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు అధికారికంగా లేఖ వెళ్లింది. సాధారణంగా నేరాలకు సంబంధించిన సంచలన కేసులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సిఫారసు చేస్తాయి. రాజకీయ కేసులను సిఫారసు చేసినా..తమకు దర్యాప్తు చేసే చాన్స్ ఉన్నా… సీబీఐకి సిఫారసు చేయడం వంటివి చేసినప్పుడు ఆ సంస్థ భిన్నంగా స్పందించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం.. అంటే బీజేపీ విధానం ప్రకారమే.. సీబీఐ ఈ కేసుకు ప్రాధాన్యత ఇవ్వనుందని అనుకోవచ్చు.
జస్టిస్ ఘోష్ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ చేయగలదా?
జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారమే ఇప్పుడు సీబీఐ విచారణకు ఆధారం. ఆ రిపోర్టు ఆధారంగానే సీబీఐ కేసు నమోదు చేయగలదా అన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. అవినీతి జరిగినప్పుడు.. మనీ ట్రయల్ ఉన్నప్పుడు సీబీఐ కేసులు నమోదు చేయగలదు. కానీ పాలనా పరమైన తప్పులు జరిగాయన్నప్పుడు మాత్రం సీబీఐ కూడా ఏమీ చేయలేదు. పాలకులు తీసుకునే నిర్ణయాలు తప్పో..ఒప్పో ఎవరూ డిసైడ్ చేయలేరు. నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉంది. నిబంధనలు ఉల్లంఘించారని.. నివేదికలను పట్టించుకోలేదని వారిని జైల్లో పెట్టలేరు. కేసులు కూడా కట్టలేరు. కచ్చితంగా అవినీతి జరిగిందని అనుకుంటేనే సీబీఐ కేసులు పెడుతుంది.
గతంలో అమరావతిపై విచారణ చేసేందుకు సీబీఐ నిరాకరణ
గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిపై సీబీఐ విచారణ చేయించడానికి చేయని ప్రయత్నాలు లేవు. అధికారికంగా సిఫారసు చేస్తూ లేఖలు రాశారు. అనధికారికంగా కేంద్రం వద్ద లాబీయింగ్ చేశారు. విచారణలో ఏమీ తేలకపోయినా.. అమరావతిపై సీబీఐ విచారణ అనే ముద్ర ఉంటుందన్న కుట్రతో అలా చేశారు. కానీ కేంద్రం అంగీకరించలేదు. సీబీఐ విచారణను చేయించలేదు. దాంతో జగన్ రెడ్డి ప్రభుత్వమే తప్పుడు కేసులు పెట్టుకుని రాజకీయాలు చేసింది. చివరికి ఏమీ తేల్చలేక పోయింది.
రాజకీయ పరిణామాలే.. కేసు విచారణలో కీలకం !
సీబీఐకి కాళేశ్వరం కేసు వెళ్లడాన్ని భారత రాష్ట్ర సమితి ఎలా చూస్తుందో స్పష్టత లేదు. తమను బీజేపీ నోటికి అందించేందుకు రేవంత్ పక్కాగా ప్లాన్ చేశారన్న అభిప్రాయానికి వస్తున్నారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే… కక్ష సాధింపు అని రచ్చ చేయాలనుకున్నారు కానీ.. నేరుగా సీబీఐకి ఇవ్వడంతో ఇప్పుడు బీజేపీపై కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీజేపీతో బీజేపీతో ఏదైనా అంతర్గత ఒప్పందానికి వస్తే .. సీబీఐ దూకుడుగా వ్యవహరించకపోవచ్చు. మొత్తానికి సీబీఐ ఇప్పుడు ఎలా స్పందిస్తున్నదానిపై కాళేశ్వరం కేసు ఎంత ఎఫెక్టివ్ అన్నది తేలే అవకాశం ఉంది.