తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర దాటింది. అయినా ఆ రాష్ట్రానికి బాలారిష్టాలు తప్పడం లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభింబిపజేసే శకటాలను గణతంత్ర దినోత్సవం రోజు జరిగే పెరేడ్ లో ప్రదర్శిస్తుంటాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఏడాది జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణా శకటం ప్రదర్శనకు అతి కష్టం మీద అనుమతి లభించింది. మొట్ట మొదటిసారి ఆ వేడుకలలో పాల్గొన్నపుడు, తెలంగాణాకే ప్రత్యేకమయిన బోనాల పండుగను, తెలంగాణా రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను హైలైట్ చేసింది తెలంగాణా శకటం. కనుక వచ్చే నెలలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలలో తమ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించుకోవాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తే అందులో తప్పేమీ లేదు. కానీ ఈసారి కూడా సంబంధిత అధికారులు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం చేసిన రెండు ప్రతిపాదనలను తిరస్కరించారు. దానికి కారణాలు ఏమిటో తెలియదు.
కేంద్రప్రభుత్వం తమ పట్ల ఈవిధంగా అనుచితంగా వ్యవహరించడంపై తెలంగాణా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచిపోయినా ఇంకా దాని ఉనికిని కేంద్రప్రభుత్వమే గుర్తిస్తున్నట్లు లేదని తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తన నిరసన తెలియజేసేందుకు ఇకపై గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమ రాష్ట్ర శకటాన్ని పంపకూడదని తెలంగాణా ప్రభుత్వం నిశ్చయించుకొన్నట్లు తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి నిన్న లోక్ సభలో ప్రకటించారు. కేంద్రప్రభుత్వం తనంతట తానుగా ఆహ్వానిస్తే తప్ప రాష్ట్ర శకటాన్ని పంపబోమని ఆయన లోక్ సభలో ప్రకటించారు. కనుక కేంద్రప్రభుత్వం తక్షణమే స్పందించి తప్పనిసరిగా తెలంగాణా రాష్ట్ర శకటం కూడా ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు అవసరమయిన చర్యలు చేపడితే మంచిది. ఈ విషయంలో తెరాస ఎంపీలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు సహకారం తీసుకొంటే మంచిదేమో ఆలోచించాలి. కేంద్రప్రభుత్వంపై అలిగి గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణా రాష్ట్ర శకటాన్ని పంపించమని చెపితే అది తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని గ్రహించాలి.


