తెలుగు పార్టీలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక లిట్మస్ టెస్టేనా..?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికను దాదాపుగా వాయిదా వేసుకున్న భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన పార్టీలకు పెద్ద సంకటంగా మారనుంది. తెలుగుదేశం, టీఆర్ఎస్, వైసీపీలకూ ఈ ఎన్నికల ఇబ్బందికరంగా మారనుంది. ఎన్డీఏ తరపున.. అభ్యర్థిగా అకాలిదళ్ ఎంపీ నరేష్ గుజ్రాల్‌ను అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం జరుగుతోంది. నరేష్ గుజ్రాల్ .. తెలుగుదేశం పార్టీపైన.. ఆ పార్టీ అధినేతపై .. అమితమైన అభిమానం చూపుతూంటారు. దానికి కారణం.. ఆయన తండ్రి ఐకే గుజ్రాల్‌ను ప్రధానమంత్రిగా చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించడమే. అందుకే అకాలీదళ్ ఎన్డీఏలో ఉన్నప్పటికీ… ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్లకు మద్దతుగా మాట్లాడుతోంది. పార్లమెంట్‌ లోపల, బయటా కూడా నరేశ్ గుజ్రాల్ పలుమార్లు చంద్రబాబు సమర్థతను అభినందించారు. ఇప్పుడు ఆయనే నేరుగా ఎన్డీఏ తరపున నిలబడితే.. మద్దతు ఇవ్వాలా వద్దా అన్న మీమాంస టీడీపీలో ప్రారంభమయింది.

ఇక టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలది విచిత్ర పరిస్థితి. బీజేపీకి దగ్గరగా.. దూరంగా వ్యవహరిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కానీ మాత్రం కొద్ది రోజుల కిందటే స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. బీజేపీకి కానీ.. బీజేపీ కూటమి అభ్యర్థికి కానీ మద్దతివ్వబోమని.. కచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేస్తామని… ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఆ పార్టీకి ఉన్నది ఇద్దరు సభ్యులే అయినా.. బీజేపీ అగ్రనాయకత్వం ఒత్తిడి చేస్తే తప్పించుకోలేని పరిస్థితి ఉంది. ఆ రెండు ఓట్లే కీలకమైతే.. బీజేపీకే మద్దతివ్వక తప్పని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆ పరిస్థితి రాకూడదని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. కనీసం ఓటింగ్‌కు దూరంగా ఉండేలా అయినా రాజకీయ పరిణామాలు ఉండాలని వారు కోరుకుంటున్నారు. కానీ ముందుగా ప్రకటించినట్లు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయకపోతే… మటుకు.. వైసీపీ ఇమేజ్‌ మరింత పతనమవుతుంది. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని.. ప్రజలంతా నమ్మే పరిస్థితి వస్తుంది.

ఇక టీఆర్ఎస్‌ది కూడా ఇంచుమంచుగా అలాంటి పరిస్థితే. బీజేపీకి మద్దతుగానే టీఆర్ఎస్ నిలబడుతోంది. కానీ ప్రత్యక్షంగా దీన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి. బీజేపీపై ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపినా.. తెలంగాణంలో ముస్లిం ఓట్లకు గండి పడతాయి. అందుకే … వాకౌట్‌కి అయినా సిద్ధమే కానీ… మద్దతుగా ఓటు వేసే అవకాశం మాత్రం లేదంటున్నారు. అదే సమయంలో తమ పార్టీకి డిప్యూటీ చైర్మన్ పోస్ట్‌ను ఏకగ్రీవంగా ఇస్తే మాత్రం తీసుకుంటామంటున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీలకు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కొత్త చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com