కాస్త లేటయినా ఫర్వాలేదు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ రియలైజ్ అయ్యారు. అభివృద్ధిలో దూసుకెళ్ళాలంటే, గల్లా పెట్టె నిండాలంటే ఏం చేయాలో ఇప్పటికి ఇద్దరికీ అర్థమైనట్టుంది. ప్రపంచదేశాలు చుట్టొస్తే ఏమొస్తుంది? ఆల్రెడీ మోయలేనన్ని అప్పులు కూడా ఉండడంతో ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అందుకే అస్సలు కష్టపడకుండా…ఎవ్వరినీ అడిగే అవసరం లేకుండా చాలా ఈజీగా ఖజానాను నింపుకునే ఐడియాలు కనిపెట్టేశారు తెలుగు చంద్రులు. ఆ నిధుల ‘మత్తు’ ఇక వదిలే అవకాశమే లేదు.
సారా…మన పాలకులకు అక్షయ పాత్రలాంటిది. ఎన్టీఆర్ అంటే మొండోడు కాబట్టి ఏదో ధైర్యం చేశాడు కానీ ఇక మన పాలకులెవ్వరికీ అంత దమ్ము లేదు. పేదోడు-పెద్దొడు, కులం, మతంతో పాటు లింగ భేదం కూడా లేకుండా తెలుగు ప్రజలందరినీ కూడా చిత్తు చిత్తుగా తాగించడం ఎలా అనే పాయింట్‌ని అధ్యయనం చేస్తున్నారు మన తెలుగు ముఖ్యమంత్రులు. ప్రస్తుతానికి ఫుడ్ కోర్ట్స్, రిసార్ట్స్‌లో మద్యం విక్రయాలకు జై కొట్టేశారు కానీ అతి త్వరలోనే విద్యాలయాలు, గుడులులాంటి వాటిలో కూడా మద్యం విక్రయాలకు పర్మిషన్స్ ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. మద్యం ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా టార్గెట్స్ పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే ఇంటింటికీ మద్యం పథకాలను ప్రవేశ పెట్టక తప్పదని ఎక్సైజ్ అధికారులే జోకులు వేసుకుంటూ ఉంటారు. నిజాయితీగా ఆలోచిస్తే ‘ఇంటింటికీ మద్యం పథకం’ కూడా అవసరమే అనిపిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా రాక్షసులు, దేశద్రోహులు…ఇంకా అంతకుమించిన వారు కూడా కాబట్టి ఎవ్వరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడొద్దు. మద్యాన్ని వ్యతిరేకించొద్దు. ఆదాయాన్ని అడ్డుకోవద్దు. మద్యం రక్షతి రక్షితః.