మన నాయకులందరూ మేమే గొప్ప ప్రజాస్వామిక వాదులం అని అనుదినమూ చెప్పుకుంటూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ప్రజాస్వామ్యం గురించి రోజుల తరబడి మాట్లాడగలరు. మీడియా స్వాతంత్ర్యం గురించి కూడా మా గొప్పగా మాట్లాడేస్తూ ఉంటారు. అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే. ఒక్కసారి అధికారంలోకి వస్తే మాత్రం వైఎస్, చంద్రబాబు, కెసిఆర్…భవిష్యత్‌లో సిఎం అయ్యే అవకాశాలున్న కెటీఆర్, జగన్, లోకేష్…ఆఖరికి పవన్ కళ్యాణ్‌ది కూడా ఒకటే మాట. విమర్శించడం తప్పు అని. మిగతా వాళ్ళు ఒకె కానీ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడే ఎలా చెప్తామంటారా? పవన్ మాటలను ఓ సారి పరిశీలించండి. పవన్ కళ్యాణ్‌కి కులాన్ని ఆపాదిస్తూ ఓ ఎడిటర్..ఓ సంపాదకీయం రాయగానే…ఈయనగారు వాళ్ళకు కాల్ చేసి మాట్లాడారట. మళ్ళీ అలా రాయొద్దు అనేలా ఏదో చెప్పారట. ఆ తర్వాత నుంచి ఆ పేపర్ వాళ్ళు పవన్‌కి కులాన్ని ఆపాదించడం ఆపేశారట. ఇవన్నీ పవన్ చెప్పిన మాటలే. ఇప్పుడే మీడియాను డీల్ చేయడం ఇలా ఉందంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించండి. నాకు కులం లేదంటున్న పవన్…నా భార్య క్రిష్టియన్ అని మాత్రం బహిరంగంగా చెప్పేశాడు. ఎలాంటి రాజకీయ స్వార్థంతో ఆ మాటలు చెప్పాడో కూడా అందరూ ఊహించగలిగిన విషయమే. నిజంగా కుల, మతాలకు అతీతమైనవాడే అయితే అలా ఎప్పటికీ చెప్పడు.
పవన్ విషయం అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు కూడా గజినిలా యాక్ట్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడులను ఇబ్బంది పెట్టాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నాలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మామూలుగా రియాక్టవలేదు. ఆవేశపడ్డాడు. దేశమంతా తిరగడానికి కూడా వెనుకాడలేదు. మరి అదే చంద్రబాబుకు అధికార మత్తు తగలగానే గతాన్ని మర్చిపోయాడు. సాక్షి మీడియాను పూర్తిగా లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడులు కానీ, ఇప్పుడు సాక్షి కానీ అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. రాజకీయ ఉద్ధేశ్యాలతో వార్తలు ప్రచురించి ఉండొచ్చు. అయినప్పటికీ నిజంగా ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగం పైన గౌరవం ఉన్నవాళ్ళు అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే తమ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకోవాలి. నిజాయతీపరుడైతే అలాంటి ప్రయత్నమే చేస్తాడు. కానీ అధికారం అందుకున్న మరుక్షణం నుంచి స్వార్థప్రయోజనాల కోసం, ఆశ్రిత పక్షపాతంతో పాలన సాగించే మన తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న వాళ్ళు మాత్రం ప్రజలకు తమ తప్పులు తెలియకుండా ఉండాలన్న ఉద్ధేశ్యాలతో ముందుకెళుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కెసీఆర్ సాధించిన మొదటి విజయం(?)..మీడియాను నియంత్రణలోకి తెచ్చుకోవడమే. సాక్షి ఒక్కటి లేకపోతే కెసీఆర్లా తను కూడా మంచి పేరు తెచ్చుకోగలనన్నది చంద్రబాబు నమ్మకం. విమర్శించే మీడియా లేకపోతే చాలు..సునాయాసంగా 2019 ఎన్నికల్లో కూడా విజయం సాధించగలమన్నది ఇద్దరు చంద్రుల ఆలోచన.
మీడియాలో విమర్శలు లేకుండా చూసుకోవాలన్న ఇద్దరు చంద్రుల ఆలోచనలను పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే. మేం చేసిన గొప్ప పనులు ఇవి. అభివృద్ధి ఇది…అని 2019ఎన్నికల్లో గొ్ప్పగా చెప్పుకుని గెలిచే సామర్థ్యం ఇద్దరికీ లేదని. ఆ విషయంలో ఇద్దరూ అసమర్ధులే అని. అలాగే ప్రజల ఆలోచనాశక్తి గురించి కూడా ఇద్దరు చంద్రులకూ అథమస్థాయి ఆలోచనలున్నాయని. తెలుగు ప్రజలకు ఈ విషయం అర్థమైన మరుక్షణమే ఇద్దరు చంద్రులకూ కష్టకాలం ప్రారంభమయినట్టే. ఇలాంటి వృథా ప్రయాసలకు పాతరేసి కాస్తన్నా ప్రజలకు ఉపయోగపడే పనుల గురించి ఆలోచిస్తే ఇద్దరికీ శ్రేయస్కరం.