తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలకు అటు ప్రభుత్వం మందుబాబులకు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకోగా, ఇటు పోలీసులు మాత్రం భద్రత విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు. పండుగ జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వాలు మద్యం విక్రయాల వేళలను పెంచగా, రోడ్లపై ప్రమాదాలు జరగకుండా పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు డిసెంబర్ 31 వేడుకల కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. మద్యం దుకాణాలు రాత్రి 12 గంటల వరకు , బార్ అండ్ రెస్టారెంట్లు , క్లబ్బులు అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు ప్రత్యేక పర్మిషన్లతో లిక్కర్ సర్వ్ చేసే వెసులుబాటు కల్పించాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై పోలీసులు యుద్ధం ప్రకటించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో వేలాది మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. ఎక్కడా బ్రీత్ ఎనలైజర్ పరీక్షల విషయంలో మినహాయింపు లేదని, తాగి దొరికితే వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా ఉండేందుకు క్యాబ్ సర్వీసులు, ప్రైవేట్ డ్రైవర్లను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లోని మెట్రో రైలు సేవలను కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడిగించడం మందుబాబులకు పెద్ద ఊరటగా మారింది.