ఇంత జరిగాక, పాక్ తో సంబంధాలా ?!

ఫోకస్

ప్రధానమంత్రి మోదీ గత 18 నెలలుగా చేసిన శాంతి యత్నాలు పఠాన్ కోట్ టెర్రర్ ఎటాక్ సంఘటనతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. భారత్ ని శాంతి కాముక దేశంగా అభివర్ణిస్తూ, అంతర్జాతీయ వేదికలమీద లెక్చర్స్ ఇచ్చిన మోదీకి ఇప్పుడు గడ్డు సమస్య ఎదురైంది. భారత్ పాక్ సంబంధాలు కథ మళ్ళీ మొదటికే వచ్చినట్లయింది.

పంజాబ్ లోని పఠాన్ కోట్ లోకి చొరబడిన ఉగ్రవాదులను అంతమొందించడానికి మూడురోజులు గా కొనసాగిస్తున్న ఆపరేషన్ ముగిసినట్లు సోమవారం ప్రకటించారు. అయినప్పటికీ కూంబింగ్ ఆపరేషన్స్ మాత్రం కొనసాగిస్తనే ఉన్నారు. ఎయిర్ బేస్ లో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమవడంతో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు అంతమైనట్లు ప్రకటించారు. ఈ సంఘటనలో ఏడుగురు భారతీయ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి తెగించారు. ముంబయి టెర్రర్ ఎటాక్ తర్వాత ఈ సంఘటను అత్యంత తీవ్రమైన దాడిగా భావించవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇరుగుపొరుగు దేశాల మధ్య సఖ్యత ఏర్పడుతుందా ? మోదీ పడుతున్న తపనకు అసలు అర్థముందా ?

ప్రధానమంత్రి మోదీ ఈ మధ్యకాలంలో ఇండో పాక్ సంబంధాల విషయంలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన చకచకా పావులు కదుపుతున్నారు. వివిధ స్థాయిల్లో ఇరుదేశాల అధికారులతో చర్చలు ఏర్పాటుచేయడంతోపాటుగా, తాను స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ని కలుసుకుని మార్గం సుగమం చేస్తున్నారు. అంతర్జాతీయ సమావేశాలు జరిగినప్పుడు కూడా వీలుచూసుకుని నవాబ్ షరీఫ్ తో, ఇండో- పాక్ సంబంధాల గురించి మాట్లాడేవారు. అయితే చివరకు ఏమైందీ ? ఈనగాచిన చేను నక్కలపాలైనట్లయింది. మోదీ, నవాబ్ షరీఫ్ ప్రయత్నాల దారి వాటిదే, ఉగ్రవాదుల దారి వారిదే అన్నట్టుగా మారింది వ్యవహారం.

2008లో ముంబయి టెర్రర్ ఎటాక్ జరిగిన తర్వాత అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలనే అనుకుంది. పాకిస్తాన్ పై సైనిక చర్య తప్పదన్నంతగా మాట్లాడింది. 26/11 నాటి టెర్రర్ ఎటాక్ తర్వాత భారత ప్రభుత్వం తన సైనిక, నిఘావర్గాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో వారందరి ఏకైక లక్ష్యం – నరరూప రాక్షసులుగా విరుచుకుపడిన ఉగ్రవాద మూకలను ప్రేరేపిస్తున్న వారి భరతం పట్టడం. ఉగ్రవాద సంస్థ లష్కర్ యీ తోబియిబా (LeT)ని అణచివేయడం, సరిహద్దుల వద్ద `జిహాదీ పోకడలను’ మట్టుబెట్టడం. వీలుచిక్కితే అమెరికా వంటి దేశాల సహాయం తీసుకుని పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల శిబిరాలపై వైమానిక దాడులు జరపడం.

ఓ పదిహేను రోజులపాటు సుదీర్ఘంగా ఈ అంశాలపై హాట్ హాట్ గా ఆనాటి ప్రభుత్వం చర్చించింది. చివరకు ఏమైందీ ? ఏవేవో భయాలు ఊహించుకుని చివరకు ఆ దూకుడు ఆలోచనలను అటకెక్కించింది. 2008లో అంతగా చూపించిన కసి చివరకు నీరుగారిపోయింది. ఈలోగా యుపీఏ సర్కార్ నిష్క్రమించి ఎన్డీయే సర్కార్ వచ్చింది. మోదీ గతంలో అమెరికాను, పాకిస్తాన్ ను తూర్పారబట్టిన మనిషే. అయితే ప్రధాని అయినతర్వాత ఆయన తన శైలిని మార్చుకుని రెండు దేశాల నడుమ సయోధ్యకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనూహ్యమైనదేదో జరగబోతున్నంత భ్రాంతి కలిగించారు. అయితే చివరకు ఏమైందీ? పఠాన్ కోట్ సంఘటనతో ఇండో – పాక్ సంబంధాల వ్యవహారం మళ్ళీ మొదటికే వచ్చింది. దీంతో మోదీ తన గేమ్ ను మళ్ళీ మొదటి నుంచీ ప్రారంభించిక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చిక్కుముడి వీడాలంటే ముందుగా కాశ్మీర్ సమస్య తేలాలంటున్నది పాకిస్తాన్. అయితే, ఉగ్రవాదులను అణచివేయాలన్నది భారత్ ప్రధాన డిమాండ్. ఉగ్రవాద భూతాన్ని అంతమొందించడం అక్కడి ప్రభుత్వం చేతుల్లో లేదన్నది జగమెరిగిన సత్యం. నవాబ్ షరీఫ్ కావచ్చూ, మరొకరు కావచ్చు, పాలకుల మాటలను అక్కడి సైనిక దళాలు, పాక్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) వినే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇరు దేశాల `రాజకీయ పెద్దల’ మధ్య చర్చలు కేవలం బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లకే పరిమితమవుతాయేతప్ప అడుగు ముందుకుపడదు. ఒక వేళ అలాంటి ఆశలు ఏదైనా చిగురించినా ముష్కర మూకలు తెగపడటంతో శాంతి చర్చల కథ అర్థాంతరంగా ముగిసిపోతున్నది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈక్వేషన్ ఏమాత్రం మారని పరిస్థితుల్లో మోదీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com