రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం ఎంత ముఖ్యమో, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా వాస్తవాలను అంగీకరించి అడుగులు వేయడం అంతకంటే ముఖ్యం. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకోవడం, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం వంటి ఈగో సమస్యలు పార్టీల అస్తిత్వాన్నే దెబ్బతీస్తాయని మహారాష్ట్రలోని శివసేన ఉదంతం నిరూపిస్తోంది. దశాబ్దాల కాలం పాటు బీజేపీతో సహజ సిద్ధమైన మిత్రపక్షంగా ఉన్న శివసేన, అధికారం కోసం తన సిద్ధాంతాలకు భిన్నమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిన నాడే తన పతనాన్ని తానే రాసుకుంది.
బాలా సాహెబ్ హయాంలో శివసేన తిరుగులేని శక్తి
బాలాసాహెబ్ థాకరే హయాంలో శివసేన అంటే ఒక తిరుగులేని శక్తి. కానీ ఉద్ధవ్ థాకరే రాజకీయ లౌక్యం ప్రదర్శించలేకపోయారు. బీజేపీని కాదని బయటకు వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పటికీ, తన పార్టీ పునాదులను ఆయన కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా గ్రౌండ్ లెవల్లో కేడర్ మనోభావాలను గుర్తించడంలో విఫలమయ్యారు. ఈ గ్యాప్‌ను వాడుకున్న బీజేపీ, ఏకనాథ్ షిండే రూపంలో శివసేనను నిలువునా చీల్చడమే కాకుండా, ఎన్నికల కమిషన్ ద్వారా అసలైన శివసేన పేరును, గుర్తును కూడా సొంతం చేసుకునేలా పావులు కదిపింది.
ఇప్పుడు అత్యంత దయనీయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు , మున్సిపల్ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. థాకరేల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని తెలుస్తూనే ఉంది. ఉద్ధవ్ థాకరే తన సోదరుడు రాజ్ థాకరేతో చేతులు కలిపినప్పటికీ, ఓటర్లను మెప్పించలేకపోయారు. ముంబై లాంటి కంచుకోటల్లో కూడా శివసేన తన పట్టు కోల్పోయింది. షిండే నేతృత్వంలోని శివసేనయే అసలైన శివసేన అని ప్రజలు గుర్తించే స్థాయికి రాజకీయాలు వెళ్లాయి. థాకరే కుటుంబం లేనిదే శివసేన లేదన్న భ్రమలను ఈ ఫలితాలు పటాపంచలు చేశాయి.
తప్పు చేసినా వెంటనే దిద్దుకున్న చంద్రబాబు
ఇలాంటి పరిస్థితులే 2019లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడికి ఎదురయ్యాయి. అప్పట్లో మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూసి, రాష్ట్రంలో దెబ్బతిన్నారు. అయితే బాబు వెంటనే వాస్తవాలను గ్రహించి, తన వ్యూహాలను మార్చుకున్నారు. తప్పును దిద్దుకుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకున్నారు. ఈ రకమైన రాజకీయ ఫ్లెక్సిబిలిటీ థాకరేలలో కనిపించలేదు. తమ ఈగో కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి, తిరిగి సొంత గూటికి చేరే అవకాశం ఉన్నా వదులుకోవడం వల్ల ఇప్పుడు రాజకీయంగా వారు ఏకాకి అయ్యారు.
ఠాక్రేలు లేని శివసేనే అసలైన పార్టీ
చివరికి శివసేన పరిస్థితి ఎలా తయారైందంటే.. ఏ పార్టీనైతే బాలాసాహెబ్ థాకరే ఒక సైన్యంలా నడిపించారో, అదే పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం చేతుల్లో లేకుండా పోయింది. కేవలం భావోద్వేగాలతో రాజకీయం సాగదని, ఎప్పటికప్పుడు వాస్తవాలను విశ్లేషించుకుంటూ నిర్ణయాలు తీసుకోకపోతే ఎంతటి వారసత్వ పార్టీలైనా నిర్వీర్యం అయిపోతాయనడానికి శివసేన ఒక పెద్ద ఉదాహరణ. ఠాక్రేలు లేనిదే శివసేన అనే పరిస్థితి నుంచి, ఠాక్రేలు లేనిదే శివసేన బలపడుతోంది అనే వాదన బలపడటం ఈ దశాబ్దపు అతిపెద్ద రాజకీయ వైపరీత్యం. అది ఠాక్రే వారసులు చేసుకున్నదే.
