ఖమ్మం నగరం శివారులోని వెలుగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో జరిగిన ఇళ్ల కూల్చివేత ఉదంతం ఇప్పుడు ఒక కొత్త సామాజిక, రాజకీయ చర్చకు తెరలేపింది. ఇక్కడ ఇళ్లు కోల్పోయిన సుమారు వెయ్యి మంది బాధితుల్లో 600 నుండి 700 మంది వరకు ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి స్థిరపడినవారని తేలింది. గత దశాబ్ద కాలంగా ఇక్కడే నివాసం ఉంటూ, స్థానిక రాజకీయ నేతల హామీలతో లక్షలాది రూపాయలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్న ఈ సెటిలర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
భూదాన్ భూముల్ని పంచిపెట్టింది బీఆర్ఎస్ హయాంలోనే!
స్థానిక రాజకీయ సమీకరణాలే ఈ అక్రమ నిర్మాణాలకు పునాది వేశాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖమ్మం టౌన్‌కు చెందిన కొందరు కీలక నేతలు, మరికొందరు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కలిసి ఈ భూదాన్ భూములను తమ అనుచరులకు, పేదలకు పంచిపెట్టారని బాధితులు చెబుతున్నారు. నాయకుల మాటలను నమ్మి, తమ కష్టార్జితాన్ని వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన వలస కార్మికులు ఇప్పుడు గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. అధికారుల కూల్చివేత సమయంలో కనీసం సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం వారిని మరింత కుంగదీసింది.
నిజమైన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు – నిజమైన అంటే?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజమైన బాధితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ హామీలో ఒక మెలిక ఉందనే వాదన వినిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు రావాలంటే వారు స్థానిక పేదలై ఉండటంతో పాటు, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదై ఉండాలి. తరతరాలుగా ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న స్థానిక నిరుపేదలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఉపాధి కోసం వచ్చి ఇక్కడ ఇళ్లు కట్టుకున్న ఆంధ్రా వలసదారుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న.
అందరికీ న్యాయం చేయాలంటున్న బాధితులు
మానవత్వంతో ఆలోచించి, కేవలం లోకల్-నాన్ లోకల్ అనే తేడా చూడకుండా, ఇళ్లు కోల్పోయిన ప్రతి నిరుపేద కుటుంబానికి పునరావాసం కల్పించాలి అని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం కాకుండా, నిరాశ్రయులైన ఈ 700 కుటుంబాల కోసం బీఆర్ఎస్ అధిష్ఠానం పెద్ద మనసుతో పోరాడి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఓట్లు లేవని.. అక్కడి వాళ్లు కాదని ..మెజార్టీ పేదల్ని పట్టించుకోకుండా వదిలేస్తుందేమో చూడాల్సి ఉంది.
