శనివారం హైదరాబాద్లోని మరోసారి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించారు. కొండా పూర్ లో 36 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను తొలగించింది. ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో ఈ భూములు ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో కొంత మంది అక్రమంగా షెడ్లు వేసి చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారందర్నీ ఖాళీ చేయించారు. ఈ భూముల విలువ రూ.3,600 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కొండాపూర్లోని సర్వే నంబర్ 59లో ఉన్న ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి, తాత్కాలిక షెడ్లు నిర్మించారు. వాటిని వ్యాపారాలకు అద్దెకు ఇచ్చారు. హైడ్రా సిబ్బంది ఈ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. వ్యాపారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, వారిని భూమి ఖాళీ చేయమని ఆదేశించారు. కూల్చివేతల స్థలానికి ఎవరినీ దగ్గరలోకి అనుమతించకుండా, రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ స్థలంపై కోర్టు వివాదాలు కూడా ఉన్నాయి. కానీ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ శనివారం ఆక్రమణలు క్లియర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ మహానగరంలో అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. హైడ్రా ఎన్ని విమర్శలు వచ్చిన ఆగడం లేదు. గాజులరామారంలోనూ ఇలాగే కూల్చివేతలు చేపట్టి.. ప్రభుత్వ స్థలానికి కంచె వేశారు.