ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ చూసి చాలా కాలం అయ్యింది. మరీ ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చుట్టూ ఓ కథ తిరుగుతూ, ఆ పాత్రలోని ఎమోషన్స్ ని పెద్ద పీట వేసేలా ఓ కథ చూసి కూడా చాలా ఏళ్లు అయ్యింది. ‘గాళ్ ఫ్రెండ్’ తో ఆ లోటు తీరే అవకాశం కనిపిస్తోంది. రష్మిక ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ నిర్మించింది. నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈరోజు ట్రైలర్ బయటకు వదిలారు.
ప్రేమలో ఉండే అన్నిరకాల ఎమోషన్స్ తో పాటు కన్ఫ్యూజన్ ని కూడా చూపిస్తున్న కథ ఇది. ప్రేమలో చాలారకాలైన గందరగోళాలు ఉంటాయి. ‘తను నాకు కరెక్టా.. కాదా’ అనే మీమాంశ ఉంటుంది. దానిపై ఎక్కువగా ఫోకస్ చేసిన కథలా అనిపిస్తోంది. ముఖ్యంగా రష్మిక క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తోంది. ఈ పాత్రని జడ్జ్ చేయడం అంత సులభం కాదేమో. ‘ఇంత క్యారెక్టర్ లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా’ అనే రావు రమేష్ డైలాగ్ తోనే ఆ పాత్రని ఎలా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవొచ్చు. రష్మిక నటన, తను పలికించిన హావభావాలూ గమనిస్తే.. ఈ క్యారెక్టర్ తన కెరీర్ లో గుర్తుండిపోతుందన్న భరోసా కలుగుతోంది. అను ఇమ్మానియేల్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ తండ్రిగా రావు రమేష్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. మరోసారి రావు రమేష్ మార్క్ చూపించే పాత్ర ఇది. ట్రైలర్లో అసలు కథేమిటో చెప్పలేదు కానీ, ఎమోషనల్ జర్నీగా ఈ సినిమా ఉండబోతోందన్న హింట్ మాత్రం ఇచ్చారు. డైలాగులు సహజంగా ఉన్నారు. నవంబరులో చాలా సినిమాలు వరుస కడుతున్నాయి. వాటిలో వాచ్ లిస్టులో చేర్చదగిన సినిమా ఇది.