చైనా కమ్యూనిజం: అవినీతికి లాల్ సలామ్!

జన చైనా. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ప్రజల అభిప్రాయంతో పనిలేని చైనా పేరులో మాత్రం ప్రజలకు కాస్త చోటు దక్కింది. ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిస్టు దేశమైన చైనా, అవినీతికి ఆలవాలంగా మారి చాలా కాలమైంది. మీడియాకు స్వేచ్ఛ లేని కారణంగా అక్కడ జరిగే అరాచకాలు బయటకు రావు, అయినా, చైనాలో పెట్టుబడిదారీ విధానం పెరిగింది. నిరంకుశత్వం పెరిగింది. అవినీతి పెరిగింది. మిలియనీర్లు పెరిగారు. సాక్షాత్తూ దేశ అధ్యక్షుడి బంధువులే విదేశాల్లో డబ్బులను దాచుకున్నారని పనామా పేపర్స్ బయటపెట్టాయి. అంటే చైనాలోనూ బినామీ ఆర్థిక అక్రమాలు వర్ధిల్లుతున్నాయన్న మాట.

చైనా ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్ పింగ్ బావమరిది డెంగ్ జియాగుయి, మాజీ ప్రధాని లీ పెంగ్ కుమార్తె లీ జియోలిన్ లు విదేశాల్లో సొమ్మును దాచారని పనామా పేపర్స్ వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరహాలోనే చైనా అధినేత అక్రమ మార్గంలో విదేశాలకు నల్లడబ్బు తరలించారనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి.

అవినీతి విషయంలో చైనా స్థానం తక్కువేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ అవినీతి గల దేశాల్లో చైనా ర్యాంక్ 122. అంటే విచ్చలవిడిగా అవినీతి దేశాల్లో చైనా ఒకటి. అయినా అక్కడి ప్రజలు నిలదీయలేరు. తిరగబడలేరు. ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేయాలంటూ లక్షల మంది ప్రజలు రాజధానిలో నిరసన ప్రదర్శన చేశారు. చైనా ప్రజలు అలా బీజింగ్ లో గుమిగూడి నినాదాలు చేయలేరు. అలా చేస్తే కాల్చిపారేస్తారు. ఒకప్పుడు తియానన్మెన్ స్క్వేర్ లో జరిగింది అదే.

చైనాలో కమ్యూనిజం ఓ మేడిపండు. అక్కడ అసలు సిసలైన నియంతృత్వ పాలన నడుస్తోంది. ప్రజలు గొంతెత్తితే కాల్చి పారేసే నిరంకుశ రాక్షస రాజ్యానికి కేరాఫ్ అడ్రస్ చైనా. వివిధ దేశాల్లోని కమ్యూనిస్టుల్లో చాలా మంది చైనా భక్తులు. అక్కడేదో ఎర్ర జెండా రెపరెపల నీడన కార్మికులు కర్షకులు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారని తమ దేశాల్లోని ప్రజలకు ప్రసంగాల్లో చెప్తుంటారు. వాస్తవం మాత్రం దీనికి భిన్నం. గూగుల్ ను కూడా ముప్పు తిప్పలు పెట్టిన దేశం చైనా.

గత దశాబ్ద కాలంలో హటాత్తుగా వందలు వేల మంది నయా మిలియనీర్లు పుట్టుకొచ్చిన దేశం చైనా. వీళ్లంతా చెమటోడ్చి రిక్షాలు తొక్కి లక్షల డాలర్లు సంపాదించారా? కమ్యూనిస్టు పార్టీలోని పదవులు, ప్రభుత్వ పదవులు, పారిశ్రామిక వేత్తల పేరుతో అక్రమాలు వగైరా తప్పుడు పనులతో కోట్లకు పడగెత్తిన వారికి స్వర్గధామంగా మారిన దేశం చైనా. క్యూబాకు, చైనాకు పోలికే లేదు.

మావో పుట్టిన దేశంలో మామూలు మనుషులు బానిసల్లా మగ్గిపోయే దేశం చైనా. ఎంత పెద్ద దేశమైనా పాలకుల మనసు మాత్రం చాలా ఇరుకు. ఎప్పుడూ ఇరుగు పొరుగు దేశాలతో గొడవే. అంత సువిశాలమైన చైనాకు మన అరుణాచల్ ప్రదేశ్ ఒక్కటే తక్కువైందట. సర్వ సత్తాక భారత రిపబ్లిక్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ను తమ మ్యాపులో చూపించుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడని దేశం చైనా. మనకు ధైర్యం లేక అడగటం లేదుగానీ, మరో దేశమైతే స్పందన వేరేగా ఉండేది. మొత్తానికి, చైనా పాలకుల నిజస్వరూపాన్ని పనామా పేపర్స్ మరోసారి బయటపెట్టాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com