ఇళ్లు కొనే ఆలోచనలు ఉన్న వారికి వర్షాకాలమే అనువైన సమయం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో ఇళ్లు, స్థలాలు కొనాలనుకునేవారు…భారీ వర్షాలు వచ్చినప్పుడే సైట్లను పరిశీలించడం వల్ల సగానికి పైగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతర సమయాల్లో బయటపడని మౌలిక సదుపాయాల సమస్యలు.. భారీ వర్షాలు బయటకు వస్తాయి.
ముఖ్యంగా ఇళ్లు లేదా స్థలం ఉన్న ప్రాంతం ముంపునకు గురవుతుందా లేదా అన్నది చూడవచ్చు. అపార్టుమెంట్ అయితే.. ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉంటే తెలిసిపోతుంది. అక్కడ అపార్టుమెంట్ పార్కింగ్ కోసం సెల్లార్ తవ్వితే ఇక చెరువులో ఫ్లాట్ కొన్నట్లే అవుతుంది. ఇక అపార్టుమెంట్ ను పూర్తి స్థాయిలో ఒక్క సారి కింద నుంచి పైదాకా పరిశీలిస్తే.. వర్షం పడినప్పుడు లిఫ్టుల్లోకి నీళ్లు చేరేలా కట్టారా.. భవనాల శ్లాబులు ఏమైనా లీకవుతున్నాయా వంటివి చూడవచ్చు. గోడలకు చెమ్మ వచ్చినా భవిష్యత్లో అనేక సమస్యలు వస్తాయి.
బిల్డర్లు వీలైనంత తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడు అద్భుతంగా కనబడితే చాలన్నట్లుగా నిర్మిస్తారు. ఇలాంటివారికి వర్షాకాలం గట్టి షాకులు ఇస్తాయి. వినియోగదారులు ఇప్పటికే కొనుగోలు చేసిన ఇళ్లను ఇలాంటి సమయంలోనే తనిఖీ చేసి రావడం మంచి పని అవుతుంది. ఇక ఖాళీ స్థలాల విషయంలోనూ అంతే. అవి చెరువుకు దగ్గర లేదా.. చెరువు భూమి అయితే పెద్ద ఎత్తున నీళ్లు నిలుస్తాయి. అలాంటి వాటిని కొనుగోలు చేయకపోవడం మంచిది.