రీ-రిలీజ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. మామూలుగా ఏదో ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా మొదలైన ఈ సాంప్రదాయం, క్రమంగా హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు ప్రతిష్టాత్మకంగా మారిపోతోంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల సినిమాలే రీ-రిలీజ్ అయ్యేవి . అది కూడా ఒకటో రెండో స్క్రీన్లలో మాత్రమే వదిలేవారు. అయితే ఇప్పుడు అది కాస్త మెయిన్‌స్ట్రీమ్ రిలీజ్‌గా మారిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది.
ప్రత్యేకమైన పబ్లిసిటీ చేసి మరీ థియేటర్లలోకి పాత బొమ్మలను వదులుతున్నారు. పబ్లిసిటీ కోసం స్వయంగా హీరోలు కూడా ముందుకొస్తున్నారు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్ కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. బాలకృష్ణ భైరవ ద్వీపం, ఆదిత్య 369 సినిమాల రీ-రిలీజ్‌ల సమయంలో ఈవెంట్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపించారు.
ఇటీవల రాజమౌళి బాహుబలి సినిమాలను ఒకే పార్ట్‌గా చేసి విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఆయన టీమ్ మళ్లీ రీ-వర్క్ చేసింది. టెక్నాలజీ ప్రకారం పలు ఫార్మాట్లలో సినిమాను కన్వర్ట్ చేసి, అన్ని థియేటర్లకు సరిపడేలా రీ-రిలీజ్ చేశారు. దీనికోసం ప్రభాస్, రానాలతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను కూడా నిర్వహించారు. ఈ సినిమా రీ-రిలీజ్ వసూళ్లు కొత్త సినిమా కలెక్షన్లతో సమానంగా రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగ్, రామ్ గోపాల్ వర్మ కలిసి చేసిన శివ తెలుగు సినిమాల్లో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ. ఇప్పుడు ఈ సినిమాను 4K క్వాలిటీలో, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో, హై-ఎండ్ టెక్నాలజీని వాడి కొత్త హంగులు దిద్ది రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. రామ్ గోపాల్ వర్మతో పాటు నాగార్జున కూడా ప్రెస్ మీట్‌కి హాజరుకానున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. స్టేజ్‌పై అమల కూడా కనిపించబోతున్నారు.
నిజానికి కొత్త సినిమాల ప్రమోషన్ విషయంలోనే స్టార్స్ కొంత వెనకముందు అవుతుంటారు. కానీ రీ-రిలీజ్ సినిమాల కోసం ఇలా ముందుకొచ్చి పబ్లిసిటీ చేసి మరీ రిలీజ్ చేయడం మారిపోతున్న ఈ ట్రెండ్‌కి నిదర్శనం.
