రుషికొండప్యాలెస్ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. రుషికొండ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకోవాలని.. మరిన్ని టూరిజం కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ప్యాలెస్ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రజాభిప్రాయం తీసుకుంది. ఎక్కువ మంది టూరిజానికి ఉపయోగించాలని సలహాఇచ్చారు.
ఈ ప్యాలెస్ విషయంలో కొన్ని అంతర్జాతీయ హోటల్ గ్రూప్స్ ఆసక్తి చూపించాయి. అయితే హోటల్ గా లేదా రిసార్ట్ గా ఉపయోగించడానికి అవి పనికిరావు. అన్ని బిల్డింగులు కలిపి పది కి అటూ ఇటూగా బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఆ నిర్మాణాలేమీ కనీసం కన్వెన్షన్ సెంటర్ గా ఉపయోగించడానికి పనికిరావు. కేవలం జగన్మోహన్ రెడ్డి రెండో సారి గెలిచి.. తాను రాజుగా…తన కుటుంబం రాజ కుటుంబంగా ఆ ప్యాలెస్ లో సేదదీరాలని అనుకున్నారు. ఆ పద్దతిలో నిర్మించుకోవడంతో ఎందుకూ ఉపయోగపడనివి అయ్యాయి.
అయితే నిర్మాణాలు చేపట్టకుండా ఇంకా తొమ్మిది ఎకరాలు చదును చేసి పెట్టారు. వాటిలో శాశ్వత నిర్మాణాలు కట్టకుండా.. వినియోగించుకుంటూ.. రిసార్టులుగా మార్చేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం.. ఈ ప్యాలెస్ ను ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రకారం వేగంగా.. తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ప్యాలెస్ ఇంత కాలం వృధాగా ఉండటం వల్ల నిర్వహణ సమస్యలతో డ్యామేజ్ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.