వీళ్లు పోరాడుతుంటే, మరి వాళ్లో…

ఉగ్రవాదం – ఉదారవాదం (చివరి భాగం)

పంజాబ్ లోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పట్టణంలోకి ఉగ్రవాదులు జొరబడి పోలీస్ స్టేషన్ ని ఆక్రమించుకున్నప్పుడు మన సైనిక బలగాలు ప్రాణాలొడ్డి ఒకవైపు పోరాడుతుంటే, మరో పక్కన కుళ్లురాజకీయాల ఊబిలో కూరుకుపోతున్న రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వెంపర్లాడటం చూస్తుంటే ఈసారి ప్రత్యక్షంగాకానీ, లేదా పరోక్షంగా యుద్ధం వస్తే మన పరిస్థితిఏమిటన్న ఆందోళన సామాన్య ప్రజల్లో కలుగుతోంది. ఐక్యత లేకపోతే దేశం కుక్కలు చింపిన విస్తరికాదా…అన్న భయాందోళనలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి.

ఈ సందర్భంగా మనం మహాభారతంలోని ఒక సన్నివేశం గురించి చెప్పుకోవాలి. పాండవులు అడవుల్లో ఉన్నప్పుడు వారని మరింత ఇక్కట్లపాలుచేయాలన్న దుర్దేశంతో దుర్యోధనాదులు అక్కడకువెళ్ళి చివరికి గంధర్వులచేత బంధింపబడతారు. ఈ విషయం ధర్మరాజుకు తెలిసి భీమార్జునులను యుద్ధానికి వెళ్లమంటాడు. మనకు గిట్టని కౌరవులను విడిపించడానికి యుద్ధంచేయడమేమిటని భీముడు అభ్యంతరంపెడతాడు. అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే, `బయటి శత్రువురానంతవరకు వారు నూరుగురు, మనం ఐదుగురం, కానీ బయటి శత్రువు వస్తే మనం నూటైదుగురం, అలాంటప్పుడు కలిసేపోరాడాలి’ అని చెప్పి పంపిస్తాడు.

దురదృష్టమేమంటే, బయటశత్రువు మనదేశ భూభాగంలోకి చొచ్చుకువచ్చినా సంకుచిత ధోరణితో మన రాజకీయ నాయకులు మాట్లాడటం అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. భిన్నత్వంలో ఏకత్వంమే మనదేశ ఐక్యతా సూత్రం. దీన్నే మనం జాతీయతాభావం అని అంటుంటాం. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొదించే విషయంలో జాతీయ విధానం అనుసరించడానికి అవసరమైన జాతీయ సంకల్పం సరైన స్ఫూర్తితో చెప్పుకోలేకపోతున్నాం.

పక్కలో బళ్లెం

మన పొరుగుదేశం దురదృష్టవశాత్తు పక్కలో బళ్లెంలా తయారైంది. పక్కపక్కనే ఉండే దేశాల మధ్య స్నేహభావం ఉండాలన్న స్ఫూర్తితో కూటమిలు కడుతున్నా ఆచరణకు వచ్చేసరికి అంతగాకలసిఉండటం సాధ్యపడటంలేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ తో స్నేహవారధి కట్టాలన్న ప్రయత్నం ఎప్పటికప్పుడు ఆదిలోనే హంసపాదవుతోంది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ పాలకులు అనుసరిస్తున్న రెండు నాలుకల ధోరణి. ఒకవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు ఉగ్రవాదంతో జతకట్టడం ఒక క్రీడలామారిపోయింది. `పొరుగువారిని మనం నిర్ణయించలేము, వారితో సఖ్యతగా ఉండటమే నేర్చుకోవాల’ని ఈ మధ్యనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ సందర్భంలో చెప్పారు. ప్రణబ్ చెప్పింది నిజమే, కానీ సఖ్యత అన్నది ఇరువురి మనసులు కలసినప్పుడు మాత్రమే సాధ్యం. పాకిస్తాన్ తో మనం సర్దుకుపోదామని అనుకున్నా ఉగ్రవాద చేష్టలతో, సరిహద్దులవద్ద కవ్వింపులతో మనల్ని రెచ్చగొడుతూనే ఉంది. పాక్ సమస్య పరిష్కారమయ్యేవరకు సరిహద్ద భద్రతన్నది నీటిమీద రాతే.

నిఘావర్గాల వైఫల్యం

మనదేశానికి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. ఉగ్రవాద కదలికలను గమనిస్తూ, వారి వ్యూహాలను ముందస్తుగా పసిగట్టి హెచ్చరికలు చేస్తుంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ హెచ్చరికలను రాష్ట్రాలు అంత సీరియస్ గా తీసుకోవడంలేదు. దీనికి ప్రధాన కారణం, ఈ హెచ్చరికలు మన వాతావరణశాఖ హెచ్చరికల్లా మారిపోవడమే. పైగా, నిఘావర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయేకానీ, బలమైన సాక్ష్యాలను, ఆధారాలను చూపించడంలేదు. దీంతో హెచ్చరికలు వచ్చినా పట్టించుకోకపోవడం మామూలైపోయింది. వందసార్లు హెచ్చరికలు వస్తే, అందులో ఒకటో రెండో నిజమవుతున్నాయి. నిఘావర్గాల నివేదికలు బలహీనంగా ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో, ఏ రకమైన విధానాన్ని అనుసరించాలో కేంద్రం , రాష్ట్రాలు కలిసి సమైక్య పద్ధతిని అనుసరించాల్సిఉంది.
ఒక్కోసారి నిఘావర్గాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజా సంఘటన (గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ సంఘటన)లో ఈ వైఫల్యం స్పష్టంగా కనబడుతోందని అంటున్నారు. ఉగ్రవాదులు దేశ సరహద్దులను యదేచ్ఛగా ఎలా దాటగలిగారు? ఎందుకని వారి కదలికలను ముందుగా పసిగట్టలేదన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవు.

నేర న్యాయవ్యవస్థలో మార్పు

మనదేశ నేరన్యాయవ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైనదని మేథావులు మొత్తుకుంటున్నా ఆ పని ఇంతవరకూ పూర్తికాలేదు. ఉగ్రవాద కేసుల్లో దోషులు తప్పించుకోవడానికి వీలులేనంత కఠినంగా చట్టాలు ఉండాలి. 1993 ఢిల్లీ బాంబు ప్రేలుడు కేసులో దేవిందర్ పాల్ సింగ్ భుల్లర్ కు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు 2014 మార్చిలో జీవితఖైదుగా తగ్గించింది. ఇలాంటి తీర్పులను తప్పుపట్టలేకపోవచ్చు, కానీ ఇవి పరోక్షంగా నేరగాళ్లకు సంకేతాలు ఇచ్చినట్టుకాదా అన్న సందేహం తలెత్తుతోంది. వీటిని తీసుకుని ఉగ్రవాద మూకలు రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదని న్యాయనిపుణులే చెబుతున్నారు.
అటు పొరుగు దేశంతో సంబంధాలు, ఇటు మన న్యాయవ్యవస్థ తీరుతెన్ను, మరోవైపు మనలోని ఉదారవాదం వెరసి ఉగ్రవాదాలు రెచ్చిపోవడానికి కారణభూతమవుతున్నాయి. అందుకే పాక్ ప్రేరిత ఉగ్రవాదులు చావుకు తెగించి మన సీమలోకి అడుగుపెట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. పదిహేనేళ్లక్రితం అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయీ ఇచ్చిన పిలుపును మనం ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి. `చావుకు తెగించి మన గడ్డమీద కాలుపెట్టిన వాడికి చావే గతికావాలి’ అన్న పిలుపును మనం మరచిపోకూడదు. అప్పుడే ఉగ్రవాద భూతం మనమంటే హడలిపారిపోతుంది. లేదంటే ఇలాగే అప్పుడప్పుడూ మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బ్యారేజీలో బోట్లు తీయడం పెద్ద టాస్కే !

ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు....

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

కామెడీ ఈజ్ కింగ్‌

సర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అన్న‌ట్టు.. జోన‌ర్ల‌న్నింటిలోనూ హాస్యం ప్ర‌ధానం అని న‌మ్ముతుంది చిత్ర‌సీమ‌. ప‌క్కాగా నవ్వించాలే కానీ, సినిమా హిట్ట‌వ్వ‌డం గ్యారెంటీ. ఇలాంటి సినిమాల‌కు జ‌నాల్లో రీచ్ కూడా ఎక్కువ‌. ఫ్యామిలీ మొత్తం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close