‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకుడిగా చేసిన మరో ప్రయత్నం ‘మోగ్లీ’. యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోతోన్న సినిమాల్లో ఇదొకటి. గ్లింప్స్ ఈ రోజు విడుదల చేశారు. నాని వాయిస్ ఓవర్ లోనే ఈ సినిమా కథంతా చెప్పే ప్రయత్నం చేశారు. ‘ఒక చిన్న ప్రేమకథ చెబుతా’ అంటూ నాని ఇచ్చిన వాయిస్ ఓవర్.. ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ‘తన బంగారు ప్రేమకథలో వేలు పెడితే.. కుట్టడా, కొట్టడా’ అని నాని చివర్లో చెప్పిన డైలాగ్ లోనే ఈ సినిమా సారాంశం మొత్తం దాగుంది. అటవీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. నేపథ్యం మారడంతో లవ్ స్టోరీకి కొత్తదనం వచ్చింది. యాక్షన్ ని చాలా గట్టిగా, కొత్తగా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. విజువల్స్ కూడా బాగున్నాయి. తొలి సినిమా ‘బబుల్ గమ్’తో పోలిస్తే… ఇందులో రోషన్ లుక్ ఇంకా బాగుంది. సాక్షి సాగర్ కథానాయికగా నటిస్తోంది. తనకు ఇదే తొలి సినిమా.
అన్నింటికంటే బండి సరోజ్ విలన్ పాత్ర లో కనిపించడం ఇంకాస్త ఆసక్తి పెంచుతోంది. యూ ట్యూబ్ లో ఇండిపెండెంట్ సినిమాలు తీసుకొంటూ, తన టాలెంట్ ని నిరూపించుకొన్నాడు బండి సరోజ్. ఈ సినిమాకు తన పాత్ర చాలా కీలకంగా మారబోతోంది. హాస్య నటుడు హర్ష కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.