నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెట్ట ప్రాంత రాజకీయం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ కుటుంబంలో టిక్కెట్లపై రచ్చ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉండటంతో పాటు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో వారి కుటుంబసభ్యులే పోటీ చేయడమో.. ఎమ్మెల్యేలుగా ఉండటమో చేస్తున్నారు. రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతం రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఎంపీగా వెళ్తే కంచుకోట ఉదయగిరి నుంచి ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిని నిలబెట్టి గెలిపించుకున్నారు.
ఆ తర్వాత కుమారుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయనను మరో బలమైన స్థానం ఆత్మకూరులో నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆత్మకూరులో గౌతంరెడ్డి భార్యను లేదా మరో మరో కుమారుడ్ని నిలబెడతారు.. అందులో వివాదం లేదు.. కానీ ఇప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యే టిక్కెట్ పై మాత్రం రచ్చ ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కి బదులుగా.. రాజమోహన్ రెడ్డి తన మరో కుమారుడికి చాన్సివ్వాలని జగన్ను కోరారు. అయితే జగన్ చంద్రశేఖర్ రెడ్డికే చాన్సిచ్చారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఉదయగిరిలో వివాదాస్పదమవుతున్నారు. ఎమ్మెల్యేగా ఆయన ఉన్నా ఆయన రెండో భార్య ఇప్పుడు అనధికారక ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారని అక్కడ పార్టీ మొత్తం ఆమె గుప్పిట్లో పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఈ సారి తన మరో కుమారుడికి ఉదయగిరి నుంచి వైసీపీ టిక్కెట్ ఇప్పించే యోచనలో రాజమోహన్ రెడ్డి ఉన్నారు. లోకల్ వైసీపీ నేతలు కూడా సీనియర్ మేకపాటికే మద్దతుగా ఉంటున్నారు. వారంతా సజ్జలను కలిసే ఆలోచన చేస్తున్నారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి … తనకు వ్యతిరేకంగా సజ్జలను కలిస్తే ఏమవుతుందని.. ఆయనకు చెప్పినంత మాత్రాన టిక్కెట్ ఇవ్వరా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.