బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడి ఫలితాల ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందన్న అంచనాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఈ సారి బీహార్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నదానిపై ఎవరూ పెద్దగా అంచనాలు వేయలేకపోతున్నారు. దిగ్గజ సంస్థలు కూడా హోరాహోరీ పోరు అంటున్నాయి. ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారయోగం దక్కుతుందని అంటున్నారు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అందరూ ఎన్డీఏకే చాన్స్ ఉందని అంటున్నారు. ఎన్నికల మేనేజ్ మెంట్ లో బీజేపీ రేంజ్ ను అందుకునే పార్టీ దరిదాపుల్లో లేకపోవడమే దీనికి కారణం.
బీహార్ ఫలితాలు శాసించేసి కులసమీకరణలే
బీహార్ లో ఎన్నికలు అంటే పూర్తిగా కుల సమీకరణంతో సాగుతాయి. అక్కడి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు, అభివృద్ధి మాటలు ప్రజలకు పెద్దగా పట్టవు. అందుకే రాజకీయ పార్టీలు కుల సమీకరణల కోసం పోటీలు పడుతాయి. కూటములుగా పార్టీలు ఉండటానికి ఇదే కారణం. భారతీయ జనతా పార్టీ, జేడీయూతో పాటు పాశ్వాన్ ఎల్జేపీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. కుర్మీలు, హిందూత్వం, దళిత కాంబినేషన్ తో బీజేపీ కూటమి పోటీ పడుతోంది. యాదవులు, ముస్లింలు, ఇతర వర్గాల మద్దతుతో కాంగ్రెస్ , ఆర్జేడీ కూటమి పోటీ పడుతోంది. ఈ రెండు వర్గాలు బలంగా ఉండటంతో పోటీ హోరాహోరీగా మారుతోంది.
బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ అడ్వాంటేజ్
ఎన్నికల మేనేజ్మెంట్ కూడా కీలకమే. బీజేపీ ఈ విషయంలో ఎంతో కసరత్తు చేస్తుంది. ఆ పార్టీకి చెందిన అనుబంధ సంస్థలు చిన్న ప్రచారం బయటకు రాకుండా క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటూ ఉంటాయి. బీహార్ లో ఏడాది కిందటి నుంచే బీజేపీ శాఖలు తమ పని ప్రారంభించాయి. ఎన్నికలకు ముందు ప్రజలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చారు. మహిళల అకౌంట్లలో పది వేలు మోదీ జమ చేశారు. రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. దీంతో.. అధికార వ్యతిరేకత అనేదాన్ని వీలైనంత వరకూ తగ్గించుకున్నారు. కానీ నితీష్ పై వ్యతిరేకత అలాగే ఉంది.
సీఎంగా ప్రజల చాయిస్ తేజస్వీ యాదవ్
బీహార్ ప్రజలకు తేజస్వీ యాదవ్ సీఎం కావాలని ఉంది. నితీష్ కన్నా ఇప్పుడు ఎక్కువ మంది తేజస్వీనే సీఎంగా కోరుకుంటున్నారు. ఇతర వర్గాల్లో కాకుండా ఆయనకు మద్దతిచ్చే వర్గాల్లో అందరూ లాలూ కుమారుడివైపే మొగ్గుచూపుతున్నారు. కానీ కులాల ఈక్వేషన్లలో ఆయన కూటమి గెలుస్తుందా లేదాఅన్న సస్పెన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎవరి ఓట్లు ప్రధానంగా చీలుస్తుందన్నది కూడా కీలకమే. ఎలా చూసినా.. బీహార్ లో ఎవరూ ఊహించనంత పోటీ కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేతకాని తనం వల్ల మొగ్గు ఎన్డీఏ కూటమి వైపే చూపిస్తున్నారు.