ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలు హీట్ ఉండదు. అది కూడా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో. మరీ ముఖ్యంగా.. ఫైనల్ లో. ఇలాంటి మ్యాచ్ లో భారత్ ని ఒంటిచేత్తో గెలిపించినవాడు.. హీరో కంటే ఎక్కువ. ఆ కిరీటం ఈసారి తెలుగోడైన తిలక్ వర్మకి దక్కింది.
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై తిలక్ వర్మ ఆడిన చిరస్మరణీయమైన ఇన్సింగ్స్ వల్ల భారత్ కు తొమ్మిదో సారి ఆసియా కప్ దక్కింది. 20 పరుగులకే 3 కీలకమైన వికెట్లు పడిపోయిన క్లిష్టమైన తరుణంలో తిలక్ చాలా పద్ధతిగా.. చాలా ప్రణాళిక బద్దంగా ఆడి భారత్ ని గెలిపించాడు. చివరి వరకూ తన వికెట్ ని కాపాడుకొంటూ, పార్టనర్ షిప్ లు నిర్మించుకొంటూ కేవలం 53 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో ఒక్కటంటే ఒక్క తప్పుడు షాట్ కూడా లేదు. బంతి బలంగా బాదాడంటే బౌండరీ దాటాల్సిందే. వికెట్ల మధ్య పరుగెత్తడంలో కూడా తిలక్ పరిణితి సాధించాడు. తిలక్‌కు శివమ్ దూబే (22 బంతుల్లో 33) చక్కని సహకారం అందించాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్.. 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 1 వికెట్ నష్టానికి 110 పరుగులతో పటిష్టంగా ఉన్న పాక్… ఆ తరవాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. స్పిన్ త్రయం కులదీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా పరుగులు చేయడంతో పాక్‌కు పరుగులు చేయడం కష్టమైంది. ఈ పిచ్‌పై 147 పరుగుల ఛేజ్ చాలా ఈజీ అనుకొన్నారంతా. కానీ భారత్ తొలి 3 వికెట్లు కేవలం 20 పరుగులకే కోల్పోయింది. పాక్ బౌలర్లు సరైన దిశలో బంతులు విసరడంతో… సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. అయితే ఈ దశలో తిలక్ చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. తిలక్ షాట్ సెలక్షన్ పర్ఫెక్ట్ అనాల్సిందే. ప్రతీ షాటూ.. వర్త్. తిలక్ లాంటి బ్యాటర్ చివరి వరకూ క్రీజ్ లో నిలబడితే.. భారత్ గెలవడం పెద్ద కష్టమేం కాదన్న భరోసా ఇచ్చాడు. అనుకొన్నట్టే భారత్ ని విజయ తీరాలకు చేర్చాడు.