ఇక రవిప్రకాష్ గేమ్ స్టార్ట్..!?

” మీడియాను కబ్జా చేస్తున్న.. ఆర్థికంగా, రాజకీయంగా కూడా అత్యంత బలవంతుడైన ప్రత్యర్థితో తలపడుతున్నాను. ఈ పోరాటంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా వెనక్కి తగ్గేదిలేదు…! ” … పోలీసుల విచారణకు హాజరైన ప్రతీ సారి.. మీడియాతో మాట్లాడిన సందర్భం వచ్చిన ప్రతీ సారి.. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ నోటి వెంట వచ్చిన మాటలు ఇవి. టీవీ9ను అలంద మీడియా కొనుగోలు చేయడం.. ఆ తర్వాత వచ్చిన వివాదాల్లో.. రవిప్రకాష్‌పై కేసు నమోదవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరట కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరరూ మైహోమ్ రామేశ్వరరావుదే పైచేయి..!

నిన్నామొన్నటి వరకు.. టీవీ9 అంటే.. రవిప్రకాష్.. రవిప్రకాష్ అంటే టీవీ9. కానీ ఇప్పుడు అదే టీవీ9లో రవిప్రకాష్ పరారీ అనే వార్తలు దగ్గర్నుంచి.. ఆయనపై టీవీ9 యాజమాన్యం న్యాయపరమైన చర్యలు తీసుకోబోతోందనే బ్రేకింగ్‌ల వరకూ వచ్చాయి. అంటే.. రవిప్రకాష్‌… ఎంతలా కోల్పోయాడో… అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్పోవడానికి ప్రధాన కారణం.. మైహోమ్ రామేశ్వరరావు. ఆయన మరో పారిశ్రామికవేత్త మేఘాకృష్ణారెడ్డితో.. కలిసి టీవీ9ను కొనుగోలు చేసి .. అత్యంత అవమానకరంగా.. రవిప్రకాష్‌ను బయటకు పంపారు. ఇంతటితో అయిపోలేదు.. ప్రతిఘటించిన రవిప్రకాష్‌పై కేసులు పెట్టారు. జైలుకు పంపడమే తరువాయన్న రీతిలో పరిస్థితులు ఏర్పరిచారు.

ఇక రవిప్రకాష్ గేమ్ స్టార్ట్..!?

అయితే.. రవిప్రకాష్.. ఏ సందర్భంలోనూ లొంగిపోలేదు. అలాంటి లొంగిపోయే మనస్థత్వం అయితే.. టీవీ9 ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆ పట్టుదలనే ప్రదర్శిస్తూ… తాను “కొండ”గా చెబుతున్న రియల్ ఎస్టేట్ కింగ్ రామేశ్వరరావునే ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. తనదైన స్టైల్లో వ్యూహాలు పన్నారు. టీవీ9 గురించి.. సమగ్ర సమాచారం.. రవిప్రకాష్ వద్ద ఉంది. ఎందుకంటే.. దానికే ఆయన కర్త, కర్మ, క్రియ. చివరికి కొనుగోలు వ్యవహారాల్లో.. జరిగిన లావాదేవీలపై కూడా.. ఆయనకు పూర్తి అవగాహన ఉంది. లావావేవీలు ఎలా జరిగాయో కూడా.. స్పష్టత ఉంది. ఆ రహస్యాలతోనే… రంగంలోకి దిగారు. తనకు తెలిసిన దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. జాతీయ స్థాయిలో తనకు జర్నలిస్టుగా ఉన్న గుర్తింపును కూడా ఉపయోగించుకుటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

రాజీ సాధ్యమా..? చేయి దాటిపోయిందా..?

అటు రవిప్రకాష్.. ఇటు మైహోమ్ రామేశ్వరరావు ఇద్దరూ… తమ పట్టుదల తాము ప్రదర్శిస్తున్నారు. నువ్వా.. నేనా అన్నట్లుగా తలపడే పరిస్థితి వచ్చింది. మైహోమ్ రామేశ్వరరావుకు తెలంగాణ సర్కార్ నుంచి… గట్టి మద్దతు ఉంది. కానీ రవిప్రకాష్‌కు ఎలాంటి మద్దతు లేదు. అందుకే.. ఇంత వరకూ.. మైహోమ్ రామేశ్వరరావు.. రాజీ అనే మాట తన ప్రయత్నాల్లో రానివ్వలేదని చెబుతారు. కానీ ఎప్పుడైతే రవిప్రకాష్.. టీవీ9 అమ్మకం డీల్స్ గురించి ప్రస్తావించారో.. అప్పుడే.. విషయం అంతా… తేడాగా మారుతుందని గుర్తించి… రాజీ ప్రతిపాదనలు పంపారని అంటున్నారు. అయితే రవిప్రకాష్ మాత్రం నిండా మునిగిన తర్వాత చలేమిటని అనుకున్నారేమో కానీ.. నిర్ద్వంద్వంగా ఆ ప్రతిపాదన తోసి పుచ్చారని.. అటో ఇటో తేల్చుకుందాని డిసైడయ్యారని అంటున్నారు.

ముందు ముందు.. ఎవరిది పైచేయి..?

ఇరువురూ ఇప్పుడు.. హోరాహోరీ తలపడుతున్నారు. ఇంత కాలం లేని బలం .. ఇప్పుడు రవిప్రకాష్‌కు అందిందని చెబుతున్నారు. అదే… రాజకీయ అండ. మైహోమ్ రామేశ్వరరావుకు.. తెలంగాణ సర్కార్ లో ప్రాబల్యం ఉంటే… రవిప్రకాష్.. కేంద్రంలో ఆ మద్దతు పొందారన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రామేశ్వరరావు గేమ్ ఆడారని.. ఇక రవిప్రకాష్ ఎత్తులు ప్రారంభమయ్యాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com