రష్యాను బెదిరించడానికే భారత్ పై సుంకాలు వేస్తున్నామని అడ్డగోలు వాదనలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. భారత్ పై ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధించారు. భారత్ కన్నా ఎక్కువగా బ్రెజిల్ మీద మాత్రమే పన్నులు ఉన్నాయి. చైనా మీద కూడా పన్నులు తక్కువగానే ఉన్నాయి. రష్యా నుంచి చైనానే అత్యధిక ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయినా చైనా జోలికి వెళ్లడానికి ట్రంప్ భయపడ్డారు. అమెరికా తమ దేశానికి అవసరమైన వస్తువులు ఎగుమతి చేయకపోతే తాము నష్టపోతామని అంచనాకు వచ్చి గతంలో చేసిన టారిఫ్ వార్ నుంచి కాళ్లు పట్టుకునే పరిస్థితికి వచ్చారు.
కానీ భారత్ సైలెంటుగా ఉందని.. దౌత్యనీతిని పాటిస్తోందని ట్రంప్ రెచ్చిపోతున్నారు. అమెరికా టారిఫ్లు విధిస్తోందని తాము ప్రతీకార టారిఫ్ల గురించి ఆలోచించడం లేదని భారత్ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. ఇప్పుడు భారత్ కూడా.. అమెరికా దిగుమతుల్ని నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతీకార సుంకాలపై భారత్ కసరత్తు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి భారత్ దిగుమతి అయ్యే వాటిలో.. మన దేశంలో ఎక్కువగా ఉత్పత్తయ్యే వాటిని చూసుకుని వాటిపై అత్యధిక భారం మోపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ నాలుగైదు సార్లు ప్రయత్నించారు. వైట్ హౌస్ నుంచి వచ్చినఫోన్లను రిసీవ్ చేసుకోవడానికి ప్రధానమంత్రి అంగీకరించలేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. ఇలా ఫోన్లు చేసి.. తమ మధ్య ఏదో ఒప్పందం జరిగిపోయిందని చెప్పడం ట్రంప్ కు అలవాటని.. పదే పదే అలాంటి అవకాశాల్ని ఆయనకు ఇవ్వకూడదని మోదీ భావించారు. అమెరికా ఇక ఎంత మాత్రమూ అగ్రదేశం కాదు. పన్నుల వలలో చిక్కి ప్రజలే విలవిల్లాడుతూంటారు. భారత్ కు తాత్కలిక ఇబ్బందే అయినా… ఎగుమతి దారుల్ని ఆదుకుంటామని ఆర్బీఐ ప్రకటించింది.