బీజేపీకి మద్దతుగా కొన్ని సీట్లలో వైసీపీ డమ్మీ క్యాండిడేట్లు..! టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్‌..!

భారతీయ జనతా పార్టీతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహస్య అవగాహనకు వచ్చిందని… జాతీయ న్యూస్ చానల్ టైమ్స్ నౌ.. ఓ స్టింగ్ ఆపరేషన్ ను ప్రసారం చేసింది. ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకోవడానికి వైసీపీ సిద్ధపడకపోయినప్పటికీ… బీజేపీకి ఉన్న పరిమితమైన బలమైన నేతలు పోటీ చేసే దగ్గర.. బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టాలనే ఆవగాహనకు వచ్చింది. ఈ విషయాన్ని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ అధికార ప్రతినిధి.. మనోజ్ కొటారి.. టైమ్స్ నౌ చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కన్నా లక్ష్మినారాయణ, విష్ణుకుమార్ రాజు లాంటి నేతలపై… వైసీపీ తరపున సామాన్యుల్ని నిలబెడతారని… ఇప్పటికే తమ పార్టీ తరపున సూచనలు వచ్చాయని.. మనోజ్ స్పష్టం చేశారు.

టైమ్స్ నౌ చానల్.. ఎన్నికల తర్వాత బీజేపీకి ఎవరెవరు మద్దతుగా నిలుస్తారన్నదానిపై.. స్టింగ్ ఆపరేషన్ చేసింది. బీజేపీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడకుండా.. ఎన్నికల తర్వాత బీజేపీతో కలవడానికి రెడీ అయిపోయిన పార్టీలను ఆ చానల్ ప్రతినిధులు కలిశారు. ఆ క్రమంలో.. విజయవాడలో మల్లాది విష్ణుకు ప్రధాన అనుచరునిగా ఉన్న మనోజ్ కొఠారితో టైమ్స్ నౌ ప్రతినిధి మాట్లాడారు. గతంలో రామ్‌మాధవ్‌తో.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చలు జరిపిన విషయం కూడా.. వీరి మధ్య సంభాషణల్లో చర్చకు వచ్చింది. బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టడమే కాదు.. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతిస్తామని.. వైసీపీ అధికార ప్రతినిధి మనోజ్ చాలా స్పష్టంగా… టైమ్స్ నౌ ప్రతినిధికి చెప్పారు. కన్నా లక్ష్మినారాయణ కోసం ఇప్పటికే.. గుంటూరు పశ్చిమ స్థానంలో ఎవరికీ తెలియని చంద్రగిరి ఏసురత్నం అనే అభ్యర్థిని ఖరారు చేశారు. ఇప్పుడు కన్నా నరసారవుపేట పార్లమెంట్ బరిలో నిలవాలనుకుంటున్నారు. దీంతో.. అక్కడ వైసీపీ ఎవర్నీ అభ్యర్థిగా పెట్టబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి బీ టీంగా… వైసీపీని… తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. దానికి తగ్గట్లుగానే వైసీపీ నేతలు బీజేపీ విషయంలో సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీపై విమర్శలు చేయడం లేదు. ఏపీకి ప్రచారానికి వచ్చే బీజేపీ అగ్రనేతలు కూడా.. ఈ విషయంలో.. జగన్‌ను ఏమీ అనడం లేదు. పూర్తిగా తమ కాన్‌సన్‌ట్రేషన్ మొత్తం చంద్రబాబుపై చూపిస్తున్నారు. దీంతో.. బీజేపీ, వైసీపీ మధ్య ఓ అండర్ స్టాండింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనే… బీజేపీ సిట్టింగులు ఉన్న చోట్ల బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టబోతున్నారని.. ఇదో రకమైన పొత్తు వైసీపీ, బీజేపీ మధ్య ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడీ విషయాన్ని టైమ్స్ నౌ చానల్ తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com