జగన్ నేరాలు చేసే శైలి నక్సలైట్లను పోలి ఉంటుందన్న చంద్రబాబు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరాలను అచ్చం నక్సల్స్ లా చేస్తారని…ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ వ్యవహారం హిట్‌ అండ్‌ రన్‌లా ఉంటుందని.. ఆదమరపుగా ఉంటే వస్తాడు.. దెబ్బతీసి వెళ్లిపోతాడని మండిపడ్డారు. రాజధానిలో పంటలకు అలానే నిప్పుపెట్టించాడన్నారు. ఒకప్పుడు నక్సలైట్లతో వ్యవహారం ఇలానే ఉండేదని గుర్తు చేశారు. చటుక్కున వచ్చి ఎవరో ఒకర్ని కాల్చిచంపి వెళ్లిపోయేవారన్నారు. చిన్న నేరం చేయాలంటేనే సగటు మనిషి భయపడతాడు.. అలాంటిది ఎంతటి రాటుదేలిన క్రిమినల్స్‌ కాకపోతే వీరు ఇలాంటి నేరాలు చేస్తారని విమర్శించారు. డేటా చోరీ, కొత్తగా బయటకు వచ్చిన ఈడీ లేఖల అంశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ వ్యాఖ్యలుచేశారు. జగన్‌.. ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్‌కు తాకట్టుపెడతాడని.. కేసీఆర్‌కు జగన్ గులాంగిరీ చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. వైసీపీ ఎప్పుడైనా రాష్ట్రం కోసం మాట్లాడిందా, పోరాడిందా? .. అని ప్రస్నించారు. తప్పు చేసినవాడు ఎప్పుడూ నోరెత్తి మాట్లాడలేరు, వైసీపీ సమస్య అదేనన్నారు. దోపిడీ చేసిన పార్టీ కాబట్టి ఎవరినీ ప్రశ్నించలేదు, పోరాడలేదన్నారు.

ఈ రాష్ట్రంలోనే ఉండని జగన్‌ ఏపీలో ఎలా పోటీ చేస్తారు.. విభజన జరిగి ఐదేళ్లయినా హైదరాబాద్‌లోనే ఎందుకు ఉంటున్నారని..చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పోటీ చేయాలంటే రాష్ట్రంలోనే ఉండాలన్న నిబంధన ఉందని.. చట్టప్రకారం చూస్తే అసలు పోటీ చేయడానికి కూడా జగన్‌కు అర్హత లేదన్నారు. ఏపీపై నమ్మకం లేకే జగన్‌ హైదరాబాద్‌లో ఉంటున్నారని గుర్తు చేశారు. ఒకటి, రెండు కాదు ఐదేళ్లు అక్కడే ఉన్నారు.. ఇప్పుడూ అక్కడే ఉన్నారు పదేళ్ల పాటు జగన్‌ హైదరాబాద్‌లో ఉండి.. కేసీఆర్‌కు ఊడిగం చేయాలనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సినేవీ ఇవ్వడం లేదన్నారు. పెద్దన్న పాత్ర పోషించి న్యాయం చేయాల్సిన కేంద్రం కూడా.. కేసీఆర్‌తో కలిసి ఏపీకి అన్యాయం చేసిందన్నారు. జగన్‌ లాంటి వాడైతే బాంచన్‌ మీ కాల్మొక్కుతా అని పడి ఉంటారని .. మోదీ, కేసీఆర్‌ ఆలోచిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. టీడీపీ డేటా దొంగిలించడానికి ప్రయత్నించి జగన్‌ అడ్డంగా దొరికిపోయారని.. ఒక ప్లాన్‌ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారని ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని చంద్రబాబు మరోసారి చెప్పారు. వైసీపీ, టీఆర్ఎస్‌, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపాయన్నారు.

నేరాలు చేయడంలో గ్రాండ్‌ మాస్టర్‌ జగన్‌ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరికీ రాని కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు జగన్‌కి వస్తాయి.. నేరాలు, కుట్రలు చేయడంలో ఆరితేరిన వాళ్లంతా జగన్‌ చుట్టూ ఉన్నారన్నారు. జగన్‌ లూటీ ఎలా చేశాడో ఈడీ డైరెక్టర్‌ కర్నాల్‌ సింగ్‌ స్పష్టంగా రాశారని.. హిందూజా కేసులో జగన్‌ క్విడ్‌ ప్రోకో కింద 11 ఎకరాలు రాయించుకున్నారని చంద్రబాబు లేఖ బయటపెట్టారు. 11 ఎకరాలు అప్పనంగా కొట్టేశారని తెలిసినా .. కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ మాయ, జగన్‌ దందా ఎలా ఉంటుందో చెప్పేందుకు హిందూజా భూముల వ్యవహారమే ఓ ఉదాహరణ అన్నారు.

అవినీతిపరులు, దొంగలకు నరేంద్ర మోదీ కాపలాదారని మండి పడ్డారు. ఇంత స్పష్టంగా ఉన్నా.. సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక్క పైసా పెట్టుబడి పెట్టకుండా జగన్‌ రూ. 500 కోట్ల ఆస్తి కొట్టేశాడని.. ఇలాంటి అడ్డగోలు నేరాల్లో జగన్ చేశాడన్నారు. ఆర్థిక నేరాలు చేసినవారంతా ఇప్పుడు ఏకమవుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆర్థిక కేసుల్లో ముద్దాయిగా ఉన్న పీవీపీ జగన్‌ పార్టీలో చేరారు.. జగన్‌కు చెందిన 70కి పైగా సంస్థల్లో పీవీపీ కంపెనీలు కూడా ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ తో కుమ్మక్కయి.. ఏపీకి అన్యాయం చేసి.. ఆయనను కేసుల నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com