తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి బాధ్యులను శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకత్వం మధ్య జరుగుతున్న భేటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కల్తీ నెయ్యి సూత్రధారులను జైలుకు పంపాల్సిందే !
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి, కెమికల్స్ వాడకంపై దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్న వేళ, కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. గురువారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , బీజేపీ కీలక నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. సిట్ దాఖలు చేసిన తుది ఛార్జ్‌షీట్ ఆధారంగా, ఈ ఘోరానికి పాల్పడిన అసలైన కుట్రదారులను, వారికి వెనకుండి సహకరించిన రాజకీయ శక్తులను చట్టపరంగా బోనులో నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది.
అసలు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యం
ప్రస్తుతం సిట్ దాఖలు చేసిన నివేదికలో 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు, అందులో కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, టీటీడీ మాజీ ఉద్యోగుల పాత్ర బయటపడటం సంచలనంగా మారింది. నెయ్యి బదులు పామాయిల్ మిశ్రమాన్ని, కెమికల్స్ ను వాడి కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టిన వారిని అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సందేశాన్ని పంపాలని నిర్ణయించింది. కేవలం అరెస్టులకే పరిమితం కాకుండా, ఈ మొత్తం వ్యవహారంలో గత ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయంపై ఆధారాలను ప్రజల ముందు ఉంచే ఆలోచనలో కూటమి ఉంది.
హిందూ ధర్మ పరిరక్షణ ఉద్యమంగా మార్పు ?
ఈ అంశాన్ని కేవలం ఒక కేసుగా మాత్రమే కాకుండా, హిందూ ధర్మ పరిరక్షణ కోణంలో సామాన్య భక్తుల దగ్గరకు తీసుకెళ్లాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, వారు చేసిన తప్పులను ఊరూరా చర్చించేలా ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ప్రజా క్షేత్రంలో భారీ బహిరంగ సభలు లేదా ధర్మ రక్షణ యాత్రల ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించే అవకాశం ఉంది. రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టడమే కాకుండా, ఆధ్యాత్మికంగా అపచారానికి పాల్పడిన వారిపై శిక్ష పడేలా చేయడం ద్వారా భక్తులలో నమ్మకాన్ని నిలబెట్టాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ గురువారం సమావేశం తర్వాత వెలువడే నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనున్నాయి. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, శ్రీవారి ప్రసాదం విషయంలో కల్తీకి పాల్పడిన పాపం ఊరికే పోదు అన్న భావనను ప్రజల్లోకి బలంగా పంపబోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.


