తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం , నిధుల మళ్లింపు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హవాలా కోణాన్ని గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా విచారణ ప్రారంభించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లేని, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన వ్యవహారంలో భారీ ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఆధారాలు లభించాయి. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే సమర్పించిన చార్జిషీటు ఆధారంగా, ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో దాదాపు రూ. 234.5 కోట్లకు పైగా నిధులు మళ్లింపు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పొమిలి జైన్, విపుల్ జైన్ వారి సంస్థలైన బోలే బాబా ఆర్గానిక్స్ ద్వారా హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ కేంద్రంగా ఉన్న హవాలా ఏజెంట్ల ద్వారా ఈ డబ్బు చేతులు మారినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై , విజయవాడ వంటి నగరాలకు ఈ అక్రమ సొమ్ము చేరినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యి సరఫరా టెండర్లను ప్రభావితం చేసేందుకు , క్వాలిటీ రిపోర్టులను మేనేజ్ చేసేందుకు ఈ హవాలా డబ్బును ముడుపులుగా వాడినట్లు ఈడీ బలంగా నమ్ముతోంది.
ఈ నిధులు కేవలం నగదు రూపంలోనే కాకుండా, టోకెన్ ఆధారిత కరెన్సీ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా అత్యంత రహస్యంగా సరఫరా అయినట్లు ఈడీ విచారణలో తేలింది. తప్పుడు బిల్లులు సృష్టించి, భోలే బాబా కంపెనీ ఖాతాల నుంచి నిధులను బయటకు తీసి, తిరిగి వాటిని వైట్ మనీగా మార్చేందుకు రౌండ్ ట్రిప్పింగ్ పద్ధతిని వాడినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు నిందితులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో నిందితులు కొనుగోలు చేసిన విలాసవంతమైన ఇళ్లు, ప్లాట్లు , ఇతర వాణిజ్య స్థలాలను హవాలా సొమ్ముతోనే కొన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఈ నిధులు ఎవరికి ఎక్కువగా చేరాలన్న తీగ లాగితే అసలు సూత్రధారుల వివరాలు బయటకు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. మరి ఆ దిశగా ఈడీ అయినా ప్రయత్నం చేస్తుందా.. దొరికినంత వరకు వాళ్ల వ్యవహారాలు మాత్రమే లెక్కలు తీసి సరి పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది.
