తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక భక్తి పూర్వక అంశంగానే కాక, రాజకీయ రంగు పులుముకుని తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు అది నెయ్యే కాదు అని సిట్ నిర్ధారించినా, దానిని పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. గతంలో వాడిన నెయ్యి అసలు ఆవు నెయ్యి కానే కాదని ప్రత్యేక విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. స్వచ్ఛమైన నెయ్యికి ఉండాల్సిన ఏ లక్షణాలూ లేకుండా, కేవలం కృత్రిమ రసాయనాలు, సబ్-స్టాండర్డ్ ఆయిల్స్‌తో దీనిని తయారు చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఒక రకంగా చెప్పాలంటే, భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టి, తక్కువ ధరకే నాసిరకం కెమికల్ మిశ్రమాన్ని సరఫరా చేశారనేది సిట్ విచారణలో వెల్లడైన చేదు నిజం.
యానిమల్ ఫ్యాట్ చర్చ వెనుక అసలు వ్యూహం ఏంటి?
సిట్ నివేదిక ప్రకారం అది నెయ్యి కాదని తేలితే.. సోషల్ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థల్లోనూ యానిమల్ ఫ్యాట్ వాడినట్లు ఆధారాలు లేవు అంటూ ఒక వర్గం విపరీతమైన ప్రచారం చేస్తోంది. అసలు సమస్య అక్కడ వాడింది నెయ్యి కాదన్నది అయితే, దానిని వదిలేసి కేవలం జంతువుల కొవ్వు ఉందా లేదా అనే సాంకేతిక అంశం చుట్టూ తిప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. నెయ్యి బదులు వాడిన రసాయనాలు జంతువుల కొవ్వు నుంచి తీసినవి కావని ఎవరు గ్యారెంటీ ఇవ్వగలరు? అయినా, నెయ్యి వాడకుండా ఏదో ఒక రసాయన పదార్థాన్ని వాడటమే అత్యంత ఘోరమైన అపచారం కదా!
బరితెగింపునకు పరాకాష్ట: రాజకీయ రంగు
ఒక పవిత్రమైన ఆలయ ప్రసాదం విషయంలో జరిగిన తప్పును ఒప్పుకోవాల్సింది పోయి, సిట్ నివేదికను తమకు అనుకూలంగా మార్చుకుని వైసీపీ మద్దతుదారులు సంబరాలు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. జంతువుల కొవ్వు లేదని తేలింది కాబట్టి మేము క్లీన్ చిట్ పొందినట్లే అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంది. కానీ, స్వచ్ఛమైన నెయ్యికి బదులు విషతుల్యమైన కెమికల్స్ వాడటం భక్తుల ఆరోగ్యంతో పాటు మనోభావాలతో ఆడుకోవడం కాదా? అని సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు.
భక్తుల మనోభావాల కంటే రాజకీయం మిన్నా?
అసలు నెయ్యే వాడకుండా భయంకరమైన తప్పిదం జరిగిందని విచారణలో తేలినా, దానిని కప్పిపుచ్చుకుంటూ నెయ్యిలో జంతువుల కొవ్వు గురించి చర్చించడం కేవలం చర్చను పక్కదారి పట్టించే వ్యూహమే. ఇటువంటి సున్నితమైన అంశాల్లో తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, వాదనలతో నెట్టుకురావాలని చూడటం నైతిక పతనాన్ని సూచిస్తోంది. ఈ బరితెగింపు ధోరణి పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
