వేంకటేశ్వరుడు ఏడుకొండలవాడు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వైఎస్ తిరుమల ఏడుకొండలు అని జీవో తీసుకు వచ్చాడు. ఇప్పుడు ఆ జీవోను కొంత మంది అన్యమతస్తులు తమ నాయకుడు వైఎస్ తెచ్చిన గొప్ప జీవో అంటున్నారు. అసలు తిరుమల ఏడు కొండలు అనే జీవో తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో వారు చెప్పడంలేదు. ఎందుకంటే ఆ ఏడు కొండల్ని రెండు కొండలు చేసింది ఆయనే కాబట్టి.. తర్వాత సెగ తగలడంతో ఏడు కొండలే అని జీవో ఇచ్చాడు. ఇదీ చరిత్ర. అయితే ఇప్పుడు మాత్రం ఆ తిరుమలేశుడికి వైఎస్సే ఏడు కొండలు ఇచ్చినట్లుగా కొంత మంది అతి చేస్తున్నారు.
వివాదానికి కారణమైన జీవో 747
2007 మే నెలలో వైఎస్ ప్రభుత్వం జీవో నెం. 747ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిని కేవలం 27.5 చదరపు కిలోమీటర్లకు పరిమితం చేస్తూ, కేవలం రెండు కొండలకే తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికే ఆలయ పవిత్రతను ఆపాదించేలా పేర్కొన్నారు. మిగిలిన కొండల ప్రాంతాన్ని ఇతర అవసరాలకు లేదా టూరిజం ప్రాజెక్టులకు ఉపయోగించుకునే వెసులుబాటు కలిగేలా ఆ జీవో ఉందన్న ఆందోళన భక్తుల్లో మొదలైంది. ఇది అన్యమత ప్రచారానికి లేదా వాణిజ్య కార్యకలాపాలకు దారితీస్తుందని హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
భక్తుల ప్రతిఘటన – ఉద్యమ రూపం
ఈ నిర్ణయంపై తిరుపతి నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తిరుమల అంటే ఏడుకొండలు.. కేవలం రెండు కొండలు ఎలా అవుతాయి అన్న ప్రశ్న ప్రతి భక్తుడి నుంచి ఎదురైంది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు పీఠాధిపతులు, హిందూ ధర్మ రక్షణ సమితులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాయి. తిరుమల కొండల పవిత్రతను కాపాడాలని కోరుతూ శ్రీవారి పాదయాత్రలు, ధర్నాలు నిర్వహించడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
మాట మార్చిన సర్కారు – జీవో 1088 తో సవరణ
ప్రజా వ్యతిరేకత తీవ్రం కావడంతో, ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల మనోభావాలకు తలవంచి, 2007 జూలైలో ప్రభుత్వం జీవో నెం. 1088ను విడుదల చేసింది. ఈ కొత్త ఉత్తర్వులో తిరుమల అంటే ఏడుకొండలే ..శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి అని స్పష్టంగా పేర్కొంటూ, మొత్తం 250 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఏడుకొండల ప్రాంతాన్ని పవిత్రమైన క్షేత్రంగా గుర్తించారు. అప్పటి నుంచి తిరుమల పర్వత శ్రేణులపై ఎటువంటి అన్యమత ప్రచారాలు లేదా ఇతర కార్యకలాపాలు సాగకుండా కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి.
రికార్డుల్లో నిలిచిన చరిత్ర
ఈ ఘటన ఏపీ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఒక ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవోను, కేవలం భక్తుల నిరసనలు ,మతపరమైన మనోభావాల కారణంగా వెనక్కి తీసుకోవడం అనేది శ్రీవారి క్షేత్రంపై ప్రజలకున్న అపారమైన భక్తికి నిదర్శనం. నేటికీ తిరుమల కొండల పరిరక్షణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఈ రెండు కొండల వివాదం , ప్రభుత్వం తలవంచిన తీరు ఒక ప్రధాన ఉదాహరణగా నిలుస్తుంది.
నిజం ఇది కాగా.. వైఎస్ ఏదో శ్రీవారికి ఏదో ఏడు కొండలు రాసిచ్చినట్లుగా కొంత మంది అన్యమతస్తులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.
