తెలుగు విలన్లు కావలెను!

Telakapalli-Raviజగపతి బాబు విలన్‌ పాత్రల్లో రాణించడం ఆహ్వానించదగిన విషయమే. ఎందుకంటే మనకు విలన్ల కొరత చాలా వుంది. అయితే ఇది కృత్రిమ కొరత. తెలుగు నాట విలన్లు తగ్గిపోతున్నారని ఒకసారి నేనంటే అంతా నవ్వారు. ఇక్కడ చెప్పేది తెలుగు సినిమాల సంగతి…

ఒక్కసారి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళితే ఎంత గొప్ప విలన్లు,.. ఎంత మహత్తర నటన.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని స్టార్‌డం.. హీరోలను కూడా కొన్నిసార్లు దాటిపోయే ప్రతిభా పాటవాలు.. అందులోనూ క్రౌర్యం, గాంభీర్యం, డైలాగులు, కామెడీ వంటి అనేకానేక ప్రత్యేకతలు.

పౌరాణిక చిత్రాల్లోనైతే కంసుడు, హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి వారు విలన్లు. జానపదాల్లో మాంత్రికులు, దుష్టులైన మంత్రులూ సేనాధిపతులు, రాజ వంశీకులు విలన్లు.. సాంఘికాల్లోనూ క్రైమ్‌ సినిమాలైతే హంతకులు, దొంగల నాయకులు, అక్రమరవాణా దారులు సంఘ వ్యతిరేక శక్తులూ.. ఇతర సినిమాల్లోనైతే మేనమాములు, సవతి తమ్ముళ్లు, దుష్టబావలు, మోసకారి భాగస్తులు, ఆడ విలన్లు.. సూర్యకాంతం వంటివారు విలన్‌ హోదా పొందని గయ్యాళి పాత్రలు..

మరీ మొదటి తరంలోనైతే వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు వంటి వారు విలన్లు. తర్వాత సిఎస్‌ఆర్‌, లింగమూర్తి,ఎస్వీఆర్‌, నారాయణరావు తదితరులు.. ఇందులో కొందరు కొనసాగి కొండ శిఖరాలు చేరగా కొత్తవాళ్లు వచ్చి కలుస్తూనే వున్నారు. ఆ విధంగా విలన్ల ప్రపంచం విస్తరిస్తూ వచ్చింది.

ఎన్టీఆర్‌ సినిమాల్లో విలన్‌కు వున్న ప్రాధాన్యత నాగేశ్వరరావు చిత్రంలో వుండదు. ఆయనవి ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు. వాటిలో ప్రతినాయకుడి పాత్ర తక్కువ. పెద్ద విగ్రహం లేని అక్కినేని విలన్‌ ముందు నిలబడితే పీలగా కనిపించేవాడు గనక ఫైటింగులు, డైలాగులు కొంచెం తక్కువగా పెట్టేవారు.

ఆధునిక తెలుగు సినిమాలో విలన్‌ వైభవానికి ప్రతీక రాజనాల. హిందీలో ప్రాణ్‌కు సమానమైన ప్రఖ్యాతి ఎవరికైనా వుందంటే అది రాజనాలకే. సాంఘిక పౌరాణిక చారిత్రిక చిత్రాలన్నిటిలోనూ తన నటనతో గొప్ప ముద్ర వేసినవాడు..అందమైన విగ్రహం, స్పుటమైన వాచకంతో హీరోకు ఏ మాత్రం తీసిపోకుండా అదరగొట్టేవాడు. మొహం విరుపుతో క్రూరత్వాన్ని పండించేవారు. కళ్లు పైకి ఎగరేస్తే అందులో దుష్టత్వం తాండవించేది. గంభీరమైన కంఠం. జానపదాలలో హీరో రామారావు, కాంతారావు ఎవరైనా విలన్‌ మాత్రం రాజనాలే. దుష్టసేనాపతిగా రాజును కాస్సేపు పక్కదోవ పట్టించి చివరికి ధిక్కారం వినిపించే రాజనాల తరహా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేది. సాంఘికాల్లోనూ పల్లెటూరి భూస్వామి వేషమైనా పట్నంలో మదించిన ధనస్వామి అయినా రాజనాల బాగా నప్పేవాడు. కొంతలో కొంత కామెడీ కూడా చూపించే వాడు. నమ్మించేట్టు మాట్లాడ్డం, మించిపోతే భయపెట్టడం రెండూ కూడా గొప్పగా పలికించేవాడు. కొంతమందిలా ఆయన క్యారెక్టర్‌ నటనవైపు గాని, హీరోయిజంవైపు గాని మారలేదు.

కొంతకాలమే వున్న విలన్‌ ఆర్‌.నాగేశ్వరరావు. పెద్దవిగ్రహం, అర్థవంతమైన నటన వున్న ఆయనను చూస్తే తనకు కొంచెం ఈర్షగావుండేదని అక్కినేని ఆత్మకథలోనే రాసుకున్నారు. (తన స్వంత చిత్రం దొంగరాముడుకు సంబంధించి) అయితే ఆయన అనారోగ్యం కారణంగా త్వరగా మరణించడం పెద్ద లోటుగా మిగిలింది. జగ్గయ్య హీరోగానూ, విలన్‌గానూ, క్యారెక్టర్‌ నటుడుగానూ కూడా రాణించిన ప్రతిభావంతుడు. ఆయన కంచు కంఠం స్వరం, కళ్లు పెద్ద ఆకర్షణలు. అక్కినేని చిత్రాల్లో ఎక్కువగా ఆయన విలన్‌గా కనిపించాడు. ఆత్మబలం, ఆస్తిపరులు వంటి చిత్రాలలో జగ్గయ్య నటన ప్రధానాకర్షణగా నిలిచింది. తర్వాతి కాలంలో అనేకానేక చిత్రాల్లో నవరసభరితంగా నటించిన జగ్గయ్య, అల్లూరి సీతారామరాజులో ధరించిన రూథర్‌ ఫర్డ్‌ పాత్ర ఎవరూ మర్చిపోరు. మరో విలక్షణ విలన్‌ ముక్కామల. ధూళిపాల కొన్ని చిత్రాల్లో విలన్‌గా నటించినా శ్రీకృష్ణ పాండవీయంలో శకుని పాత్ర ఆయనకు ఎనలేని ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది.

క్యారెక్టర్‌ నటుడుగా గుర్తుకు వచ్చి కంటతడి పెట్టించే ఎస్వీరంగారావు పెద్ద విలన్‌. ‘చెంతకు చేరవే బుల్‌బుల్‌’ అంటూ పాతాళభైరవిలో ఆయన దరించిన నేపాళ మాంత్రికుడి పాత్ర చిత్రసీమకే ఒక హైలెట్‌. హీరోగా రంగ ప్రవేశం చేసిన ఎస్వీఆర్‌ స్తూలకాయం కారణంగా అనతి కాలంలోనే విలన్‌గా మారి తండ్రి పాత్రల్లో స్థిరపడ్డాడు. రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు ఆయన పెట్టింది పేరు. ఎన్టీఆర్‌ తప్ప మరే నటుడు ఆయన ముందు నిలబడి కనిపించడమే చాలా కష్టం. ఇద్దరు అగ్ర హీరోలతో సమానంగా ప్రకాశించిన ఏకైక నటుడు ఎస్వీఆర్‌ మాత్రమే.

మరో విలక్షణ విలనీ గుమ్మడిది. గుమ్మడి ‘గుండె నొప్పి’ అని పేరు తెచ్చుకున్న ఈయన సాఫ్ట్‌ విలన్‌గా అనేక చిత్రాల్లో నటించారు.
కైకాల సత్యనారాయణ అత్యధిక చిత్రాల్లో విలన్‌గా నటించాడు.

రెండు మూడు దశాబ్దాల పాటు హీరో ఎవరైనా సరే విలన్‌ సత్యనారాయణే. ఎన్టీఆర్ ను పోలిన రూపంతో సిపాయి కూతురు చిత్రంతో రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ రాముడు భీముడు వంటి చిత్రాల్లో ఆయనకు డూప్‌గా కూడా నటించాడు. తర్వాత బాగా లావై పోలికలు తగ్గాయి. ఆజానుబాహుడు కావడంతో మొహానికి ముసుగేసుకున్న దొంగల నాయకుడైనా భూస్వామి వేషం కట్టినా సరిపోయేవాడు. 1970 లలో విశ్వనాథ్‌ తీసిన శారద తర్వాత ఆయన క్యారెక్టర్‌ పాత్రలూ పోషించడం పెరిగింది. దాసరి ప్రోత్సాహంతో హీరోగానూ నటించాడు. బహుశా ఎస్వీఆర్‌ ప్రాభవం తగ్గించేందుకోసం, ఎన్టీఆర్‌ ప్రోత్సహించి దుర్యోధనుడి వేషం వేయించారు. క్రమేనా ఎస్వీఆర్‌కు ప్రత్యామ్నాయమై పోయాడు. జంజీర్‌ను నిప్పులాంటి మనిషి పేరుతో తెలుగులో తీసినప్పుడు అందులోని షేర్‌ఖాన్‌ పాత్రకు ఎస్వీఆర్‌ మరణం తర్వాత ఆయననే తీసుకోవడం, అది అద్భుతమైన విజయం సాధించడం తెలిసిన విషయాలే. అదే వూపులో ప్రాణ్‌ హిందీలో వేసిన పాత్రను నా పేరే భగవాన్‌గా తెలుగులో అపూర్వంగా చేశాడు. యమగోల, యమలీల చిత్రాల్లో యముడుగానూ సత్యనారాయణ విజయానికి ప్రధానంగా దోహదం చేశారు.స్వంత చిత్ర నిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. తెలుగు దేశం ఎంపి కూడా అయ్యారు.
సత్యనారాయణకు తోడుగా కుడిఎడంగా కనిపించిన విలన్లు ప్రభాకరరెడ్డి, త్యాగరాజు. అప్పటి రౌడీ దొంగల సినిమాల్లో వీరంతా కలిసి పెద్ద గ్యాంగులుగా కనిపించేవారు. ఈ తరహాలో డజన్ల కొద్ది చిత్రాలు వచ్చి వుంటాయి.

డెబ్బయ్యవ దశకంలో డైలాగులతో సంచలనం కలిగించిన విలన్‌ నాగభూషణం. వామపక్ష భావాలతో రక్తకన్నీరు నాటకం ద్వారా ప్రసిద్ధికెక్కిన నాగభూషణం రాజకీయ నేతలను ఎండగట్టే విలనీకి పర్యాయపదంగా మారారు. ఎన్టీఆర్ తో ఆయన కలసి నటించిన కథానాయకుడు, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి చిత్రాలు పాలకవర్గాల అవినీతి పోకడలను తూర్పారపట్టడంలో మంచిపాత్ర నిర్వహించాయి. పదాల విరుపు ఆయన, నొక్కడం ఆయన ప్రత్యేకత. నటన కన్నా వ్యంగ్య భాషణాల ద్వారా గొప్పగా చప్పట్లు కొట్టించేవారు. ఈయన కూడా క్యారెక్టర్ వేషాలు వేయడమే కాక నిర్మాతగానూ మంచి చిత్రాలు తీశారు.

సత్యనారాయణ మంచి విలనుడే గాని రొటీన్‌ పద్ధతి ఎక్కువ. ఆయన విలనీ మూసధోరణిలోనే వుంటుందనే భావన బలపడుతున్న దశలో వచ్చాడు రావు గోపాలరావు. జగత్‌ కిలాడీలు అనే చిత్రంలో ఎస్వీఆర్‌, గుమ్మడి మధ్య ఆయన ప్రవేశించాడు. తర్వాత కాలంలో తన గొంతుకు ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్న రావు గోపోలరావు మొదట్లో డబ్బింగ్‌ గొంతుతో నటించడం ఒక తమాషా. బాపు తీసిన ముత్యాల ముగ్గు ఆయనను తారాపథంలో నిలిపింది. తర్వాత కొంత కాలం పాటు ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన మస్ట్‌. ఈయనా శారద తోనే క్యారెక్టర్‌ నటుడయ్యాడు. ఎన్టీఆర్‌ నుంచి చిరంజీవి వరకూ అనేక మంది హీరోలకు దీటుగా విలనీ పలికించి భేషనిపించుకున్నాడు. అడవి రాముడు, వేటగాడు వంటి సినిమాల్లో రావు గోపాల రావు సత్యనారాయణ ఇద్దరూ కలసి కథను పండించిన తీరు మర్చిపోలేనిది.

స్వర్గం నరకంలో దాసరి నారాయణరావు తీసుకొచ్చిన మోహన్‌ బాబు తర్వాత విలన్‌గా స్థిరపడ్డాడు. భారీ విగ్రహం, ఖంగున మార్మోగే కంఠంతో మోహన్‌ బాబు ఒక విలక్షణ స్థానం సంపాదించుకున్నాడు. కొంతకాలం హీరోగా ప్రయత్నించి మళ్లీ విలనుగా మారి ప్రత్యేకమైన మ్యాడులేషన్‌తో వెకిలి వేషాలతో గిలిగింతలు పెట్టాడు. స్వంత చిత్రాలతో పెద్ద విజయాలు సాధించి అగ్రనటులలో ఒకడయ్యారు. నూతన్‌ ప్రసాద్‌ నూటక్క జిల్లాల అందగాడుగా అడుగు పెట్టి పలుచిన్న చిన్న చిత్రాల్లో విలనుగా అలరించాడు. ఆయనలోనూ కామెడీ ఎక్కువే. అనుకోని విధంగా ప్రమాదం పాలు కావడంఆయన నటజీవిత విజృంభణకు ఫుల్‌స్టాప్‌ పెట్టించింది.

తర్వాత చెప్పుకోదగిన ప్రముఖ విలన్‌ కోట శ్రీనివాసరావు. ప్రతిఘటన చిత్రంలో అసలు విలన్‌గా తమిళనటుడు చరణ్‌ రాజ్‌ నటించినా రెండో విలన్‌లాటి మంత్రి కాశయ్య పాత్రలో కోట ప్రవేశించారు. కాని ఆయన తెలంగాణా మ్యానరిజమ్స్‌ విపరీతంగా ఆకర్షించాయి. కొత్త వరవడి పెట్టాయి. అప్పటి నుంచి కోట కొన్ని వందల సినిమాలలో వరుసగా నటించి విజయదుందుభి మోగించారు. సంభాషణలలో కామెడీ కలిపిన ఆయన శైలి ఒక ప్రత్యేకతగా మారింది. కొన్ని సందర్బాల్లో వెకిలిగా వుంటుందన్న భావన కూడా తీసుకురాకపోలేదు.
రచయిత, నటుడు గొల్లపూడి కూడా ఎనభయ్యవ దశకంలో అనుకోని విధంగా చిత్రాల్లోకి వచ్చి అనేకానేక చిత్రాల్లో విలనుగానూ, సహాయకుడుగానూ కనిపించాడు. మ్యాడులేషన్‌లో తనదీ ఒక శైలి.

కోట తర్వాత తెలుగు విలనీకి గ్రహణం పట్టిందనే చెప్పాలి. రఘువరన్‌, అమ్రీష్‌ పురి ఆ పిమ్మట ప్రకాశ్‌ రాజ్‌లు తెలుగు తెరకు ఆరాధ్యులయ్యారు. అమ్రీష్‌ పురి జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాల్లో బాగా ఆకర్షించాడు. గంభీరమైన కంఠంతో ఆయన తన డైలాగులు తనే చెప్పుకోవడం ఒక ఆకర్షణగా మారింది. వినోదం చిత్రంలో టూ ఇంటలిజెంట్‌ పెళ్లికొడుకుగా కామెడీ పాత్రతో ప్రవేశించిన ప్రకాశ్‌ రాజ్‌ తర్వాత పుంఖానుపుంఖంగా నటించి విజయానికి చిరునామాగా మారాడు. విలనీలో వివిధ రకాలను చూపించాడు. తర్వాతి కాలంలో మళ్లీ ఏ తెలుగు విలన్‌ ఆ స్థాయికి చేరుకోలేకపోయాడు. అసలు ఆ విధమైన ప్రోత్సాహం కూడా తగ్గింది. గిరిబాబు, ప్రసాద్‌బాబు, సత్యేంద్రకుమార్‌, కృష్ణ భగవాన్‌, ప్రదీప్‌ శక్తి, పృధ్వీ తదితరులు వివిధ దశల్లో విలన్లుగా మెరిసి మాయమైనారు.

సమరసింహారెడ్డితో మొదలైన ఫ్యాక్షన్‌ కథలు కొత్త తరహా విలనీని ప్రవేశపెట్టాయి. జయప్రకాశ్‌ రెడ్డి ఈ పాత్రలకు పెట్టింది పేరైనా ప్రధానాకర్షణ మాత్రం హిందీ నుంచి వచ్చిన పరభాషా విలన్లే! అజరు పి.దేవన్‌, ముఖేష్‌ రుషి, షియాజి షిండే వంటి విలన్లు రాయలసీమ ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తుంటే ప్రేక్షకులు ఆహా ఓహో అనడం నిజంగా తమాషా అయిన పరిణామమే! వీరిలోనూ అనేక ప్రత్యేకతలు. షియాజి షిండే అయితే కొంచెం కామెడీ పలికిస్తాడు. సన్నటి ముఖేష్‌ రుషి విలన్‌గా వేస్తూనే ఒక్కడు వంటి చిత్రాల్లో పోలీసు ఆఫీసర్‌గానూ బాగా మెప్పించాడు. అజరు పి దేవన్‌ అయితే అచ్చమైన తెలుగు వాడిలా కనిపించేవాడు. ముకుల్‌ దేవ్‌ ఏకకాలంలో ప్రధాన విలన్‌గా కనిపించడంతో పాటు కొడుకుగానూ అమరి పోయేవాడు. గౌతమ్‌ అధికారిది మరో శాడిస్టు శైలి. పోకిరీలో పోలీసు ఆఫీసరుగానూ గుడుంబా శంకర్‌లోనూ ఆయన నటన అందరికీ గుర్తుంటుంది. పలు చిత్రాల్లో పాత్రలు వేసినా వెంకీలో పోలీసు శిక్షణనిచ్చే అధికారిగా వుండి నేరం చేసిన పాత్రలో నటించిన అగ్నిహోత్రి మరింత క్రూరంగా కనిపిస్తుంటాడు. సై చిత్రంలో బిక్షు పాత్రలో కనిపించిన కూడా ఒక ఆకర్షణ అయ్యాడు. అరుంధతి చిత్రంలో సోనూ సూద్‌ ‘వదల బొమ్మాళి…’ అంటూ తెరపై ప్రకంపనలు పుట్టించాడు. ఇంకా అనేక మంది బుల్లి విలన్లు అన్ని దశల్లోనూ వుంటున్నారు..ఇప్పుడు కూడా అలాటి వారున్నారు.

హీరో సుమన్‌, రజనీ కాంత్‌ శివాజీలో విలన్‌గా చాలా బాగా కనిపించినా తర్వాత ఆ తరహా వేషాలు రాలేదు. ఇప్పుడిప్పుడు జగపతిబాబైనా అంతగా స్థిరపడతాడా చూడాలి. రావుగోపాల రావు కుమారుడుగా గాక తనదైన ఆకర్షణ, ఉచ్చారణ గల రావు రమేష్‌ ఇటీవలి కాలంలో బాగా నిలదొక్కుకుంటున్నారు గాని స్టార్‌డం వచ్చిందని చెప్పలేం. మర్యాదరామన్నతో వచ్చిన నాగినీడు కూడా ఒక మేరకు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

శరీర సౌష్టవం, చలాకీ తనం వున్నప్పటికీ ఎందుకు తెలుగు విలన్లు ప్రోత్సాహం పొందడం లేదు? వారసులే హీరోలుగా వస్తున్న రీత్యా తెలుగు ప్రజలకు దగ్గరగా వుండిపోయే విలన్లు వుంటే ఇబ్బందే. విలన్‌ హీరోను తినేసే అవకాశం వుండకూడదు. ఆ మాటకొస్తే హీరోయిన్లు తల్లులుగా తండ్రులుగా వేసేవారు కూడా పెద్దగా గుర్తుండకూడదు. ఒకసారి నేను ఈ మాటే అంటే గొల్లపూడి మారుతీరావు గారు దాంట్లో కొంత నిజముందన్నారు. కళాత్మక వ్యాపారమైన సినిమా రంగంలో హృదయం కన్నా మనుగడే ముఖ్యం మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close