బాహుబలిని రెండు భాగాలుగా తీస్తున్నాం అని రాజమౌళి ప్రకటించినప్పుడు కొంత చర్చ నడిచింది.
ఒక కథని రెండు భాగాలుగా చేయడం ఏమిటి? ఒక సినిమా చూడడానికి రెండు టికెట్లా? అని ఎగతాళి చేసినవాళ్లు ఉన్నారు. కానీ పార్ట్ 2లో ఉన్న గమ్మత్తు, కమర్షియల్ స్ట్రాటజీ ఏమిటో చూపించిన ప్రాజెక్ట్ అది. అక్కడ్నుంచి మొదలైంది.. ఫ్రాంచైజీల జోరు. పుష్ప, కేజీఎఫ్, ఇప్పుడు… కాంతార. ఈ దారిలో నడవడానికి చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఓరకంగా చూస్తే భవిష్యత్ అంతా ఫ్రాంచైజీలదే అనిపిస్తోంది.
తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా వస్తున్నాయి. టిల్లు, మ్యాడ్ సినిమాలు పార్ట్ 2లోనూ హిట్టయ్యాయి. అఖండ 2 రిలీజ్‌కి రెడీగా ఉంది. రాజుగారి గది 4 కూడా వస్తుందిప్పుడు. మిరాయ్ 2, హనుమాన్ 2, జాంబిరెడ్డి 2… ఇలా తేజా సజ్జా చేతిలోనే ఏకంగా మూడు ఫ్రాంచైజీలు ఉన్నాయి. కాంతార చాప్టర్1 కి వస్తున్న ఆదరణ చూస్తే.. ఈ పరంపర ఇప్పట్లో ఆగేలా అనిపించడం లేదు. కాంతార చాప్టర్ 2ని కూడా రిషబ్ శెట్టి ప్రకటించేశాడు. దృశ్యం, దృశ్యం 2, దృశ్యం 3… ఇలా ఈ కథని కూడా ఎన్నిసార్లయినా చెప్పొచ్చు. అంత సత్తా ఉన్న ఫ్రాంచైజీ అది. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ చేసే అవకాశం ఉంది. ఓజీ 2 వస్తుందని పవన్ కల్యాణ్ కూడా ప్రకటించేశాడు. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ ఫ్రాంచైజీ సినిమాలకు ఒప్పుకోవడం ఈ ట్రెండ్ కి ఉన్న ప్రాచూర్యం ఏపాటిదో చాటి చెబుతోంది. రాజాసాబ్ 2 ఛాన్సుంది. రాజాసాబ్ క్లైమాక్స్ లో పార్ట్ 2కి లీడ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కార్తికేయ 3, బింబిసార 2, పుష్ప 3, ఆర్.ఆర్.ఆర్ 2, ఆర్య 3.. ఇవన్నీ చర్చల్లో నడుస్తున్న సినిమాలు.
సీక్వెల్ అనేదానికి అర్థం మారిపోయింది. ఓ కథలో పాత్రని కంటిన్యూ చేస్తూ ఎన్ని భాగాలైనా తీయొచ్చన్న ధీమా కలుగుతోంది. సీక్వెల్స్ లో ఒకే హీరో కనిపించాలి, ఒకే దర్శకుడు టేకప్ చేయాలి అనే రూల్ లేదు. నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్ట్ ని బట్టి మారిపోతున్నాయి. ఓ హిట్ సినిమా పేరుని, క్యారెక్టర్నీ వాడుకొని ఎన్ని కథలైనా రాయగలం అనే ధీమా దర్శకుల్లో కలుగుతోంది. కొత్త కథతో ప్రయోగాలు చేసి, చేతులు కాల్చుకోవడం కంటే – హిట్ ఫ్రాంచైజీని నమ్ముకొంటే కనీసం ఓపెనింగ్స్ అయినా రాబట్టొచ్చు అనేది నిర్మాతల ఉద్దేశ్యం కావొచ్చు. కాకపోతే… ఫ్రాంచైజీని నమ్మి ఫ్లాపులైన సినిమాలు కూడా ఉన్నాయి. పార్ట్ 1 లో చూపించిన కంటెంట్ ని మించి ఉంటే తప్ప పార్ట్ 2లు ఆడవు. కామెడీ, క్రైమ్ కామెడీ, థ్రిల్లర్లకు ఫ్రాంచైజీలు బాగా కలిసొస్తుంటాయి. కాకపోతే ఈసారి పెద్ద హీరోలు, కమర్షియల్ బాటలో నడిచే కథలు సైతం ఫ్రాంచైజీల బాట పట్టడం గమనించాల్సిన విషయం. కొత్తగా రాయడానికి కథలేం దొరకనప్పుడు, హిట్ కాంబో అందుబాటులో ఉన్నప్పుడు ఫ్రాంచైజీల కంటే గొప్ప ఆప్షన్ ఉండదేమో ఇక.