స్టూడెంట్ నంబర్ ఒన్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు రాజమౌళి. అంతకుముందే నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ ఒన్ సినిమా తర్వాత నుంచి జక్కన్న, తారక్ ఇద్దరూ కష్టపడ్డారు. ఇద్దరూ కూడా వరుసగా సినిమాలు చేశారు. రాజమౌళి కంటే ఎన్టీఆరే ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ ఈ రోజు రాజమౌళి పొజిషన్ ఏంటి? ఎన్టీఆర్ స్థాయి ఏంటి? ఒక్క ఎన్టీఆర్ అనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వేరే ఏ ఒక్క హీరో అయినా రాజమౌళి స్థాయిని అందుకోగలరా? సినిమా తర్వాత సినిమా చేసుకెళ్తూ, ఎంతో కొంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ, కెరీర్ కంటిన్యూ చేద్దాం అని అనుకునేవాళ్ళు…… మనకు రాజమౌళి అంత సీన్ లేదు అని ఆలోచించేవాళ్ళ విషయం పక్కన పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్స్, హీరోలు కూడా ఇప్పుడు రాజమౌళిలానే ఆలోచిస్తున్నారు. రాజమౌళిలాగే రాశి కంటే వాసికి ప్రాధాన్యతనిస్తూ, సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు.
అందుకే ఒక సినిమా పూర్తయిన వెంటనే రెండో సినిమాను పట్టాలెక్కించలేకపోతున్నారు. సరైనోడు పూర్తయిన తర్వాత ‘డిజె’ సినిమాను మొదలెట్టడానికి అల్లు అర్జున్‌కి చాలా నెలలే పట్టాయి. అలాగే ‘అ…ఆ’ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన నితిన్ కూడా తర్వాత సినిమాను సెట్ చేయడం కోసం చాలా టైం తీసుకున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు చేస్తున్న సినిమాను కూడా టాప్ రేంజ్ టెక్నీషియన్స్, అదే స్థాయి నటీనటులతో భారీగా తెరకెక్కించాలన్న కండిషన్‌కి ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్న తర్వాతే ఆ సినిమాకు సైన్ చేశాడు. ఓ తెలుగు స్టార్ హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో మన హీరోల చుట్టూ తిరుగుతున్న లింగుస్వామికి ఆఖరి నిమిషంలో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా రీజన్ అదే. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్, అది కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ప్రాజెక్ట్ కాబట్టే తన రేంజ్ పెరుగుతుందన్న ఉద్ధేశ్యంతోనే లింగుస్వామితో చేయడానికి రెడీ అయ్యాడు బన్నీ. రామ్ చరణ్‌లాంటి హీరోలు కూడా గౌతమ్ వాసుదేవ మీనన్, మురుగదాస్‌లాంటి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయాలని ఉందని, ఇగోలను పక్కన పెట్టి మరీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండడానికి కారణం అదే.
ఈ హీరోలనే కాదు…ఇప్పుడు తెలుగులో ఉన్న చాలా మంది హీరోలు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం కాస్త లేటయినా ఫర్వాలేదు కానీ వాళ్ళ మార్కెట్ రేంజ్‌ని, క్రేజ్‌ని అమాంతం పెంచే స్థాయి సినిమాలే చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడెలాగూ వంద సినిమాలు, రెండొందల సినిమాలూ చేసే పరిస్థితులు లేవు. కాబట్టి చేసిన కొన్ని సినిమాలతోనే ఎంతవరకూ అవకాశం ఉంటే ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు.
ఇక మన తెలుగు మీడియావాళ్ళు కూడా…. ఇంకా ఎందుకు తర్వాత సినిమా స్టార్ట్ చేయలేదు? ప్రొడ్యూసర్స్ లేరా? డైరెక్టర్స్ లేరా? ఎవ్వరితోనూ సెట్ కావడం లేదా? అనే విమర్శలను కాస్త తగ్గిస్తే బెటర్. అప్పుడే కాస్త ఎక్కువ టైం తీసుకుని అయినా హై రేంజ్ సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తారు మన స్టార్స్. సూర్యతో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్ సినిమాను తెరకెక్కించాలన్న త్రివిక్రమ్ ప్రయత్నం ప్రస్తుతానికి ఆగిపోయినప్పుడు కూడా చాలా మంది చాలా రకాల విమర్శలు చేసేశారు. అది త్రివిక్రమ్ ఫెయిల్యూర్ అనేలా రాసేశారు. మల్టీస్టారర్ సినిమాలు, మల్టీ లాంగ్వేజెస్‌లో, భారీ బడ్జెట్ సినిమాలు సెట్ చేయాలనుకున్నప్పుడు కచ్చితంగా కాస్త ఎక్కువ టైమే పడుతుంది. అలాగే కొన్ని సార్లు ఆఖరి నిమిషాల్లో ఆ ప్రయత్నాలు కేన్సిల్ అవుతూ ఉంటాయి కూడా. అలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు…. మీడియా వాళ్ళ విమర్శల స్థాయి కాస్త తగ్గితే తెలుగు హీరోలు, డైరెక్టర్స్ కూడా భారీ ప్రయత్నాలను, తెలుగు సినిమా రేంజ్‌ని పెంచే ప్రయత్నాలను ఇంకాస్త ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది.