ఈ యేడాది వరుస ఫ్లాపులకు సెప్టెంబరు బ్రేకులు వేసింది. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి విజయాలు బాక్సాఫీసుకు ఊరట ఇచ్చాయి. ‘ఓజీ’తో థియేటర్ల దగ్గర మళ్లీ కళకళలు కనిపించాయి. ఎలా చూసినా… 2025 క్యాలెండర్ లో సెప్టెంబరు గుర్తుంచుకోదగినది. ఇప్పుడు అక్టోబరు వంతు వచ్చింది. అక్టోబరుపై కూడా టాలీవుడ్ భారీ ఆశలే పెంచుకొంది. ముఖ్యంగా దీపావళి సీజన్లో సినిమాలు వరుస కట్టబోతున్నాయి. ఆ సినిమాలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సెప్టెంబరు జోష్ అక్టోబరు కూడా కొనసాగిస్తే నిర్మాతలకు కాస్త ఊపిరి తీసుకొనే ఛాన్స్ దొరుకుతుంది.
అక్టోబరు తొలి వారమే శుభారంభం దక్కింది. దసరా సీజన్ కావడంతో థియేటర్లు నిండుకొన్నాయి. అక్టోబరు 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’కు మంచి ఆదరణ దక్కుతోంది. ఈవారం బాక్సాఫీసుని ఈ సినిమా ముందుండి నడిపించే ఛాన్స్ వుంది. తదుపరి వారం బాక్సాఫీసు ఖాళీగా కనిపించబోతోంది. ‘శశివదనే’ తప్ప మరో సినిమా లేదు. ఎందుకంటే.. దీపావళి సీజన్ లో సినిమాలు వరుస కట్టబోతున్నాయి. ఇలాంటి సీజన్‌కు ముందు కాస్త బ్రేక్ దొరకడం సహజమే.
దీపావళి సందర్భంగా టాలీవుడ్ లో కొత్త సినిమాల జాతర చూడబోతున్నాం. ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘మిత్రమండలి’ చిత్రాలు ఈ పండక్కి రాబోతున్నాయి. నాలుగూ మీడియం రేంజ్ సినిమాలే. నాలుగింట్లోనూ ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించే అంశాలు ఉన్నాయి. సాధారణంగా దీపావళిని అన్ సీజన్‌గా చూస్తుంటుంది టాలీవుడ్. కానీ గత కొన్నేళ్లుగా ఆ సెంటిమెంట్ మారిపోయింది. దీపావళికి వచ్చే సినిమాలకు కూడా ఆదరణ లభిస్తుండడంతో… ఈ సీజన్‌పై కూడా గట్టిగా కన్నేశారు నిర్మాతలు.
అక్టోబరు నెలాఖరున కూడా మంచి సందడి కనిపించే అవకాశాలు ఉన్నాయి. `బాహుబలి` రెండు భాగాల్ని కలిపి ఒకే సినిమాగా విడుదల చేయబోతున్నారు. రాజమౌళి బృందం ఈసారి కూడా గట్టిగా ప్రమోషన్లు చేయబోతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది మరో పండగ అని చెప్పొచ్చు. అక్టోబరు 31న ‘బాహుబలి ఎపిక్’ రాబోతోంది. ఆ రోజే… రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ కాబోతోంది. చాలాసార్లు వాయిదా పడిన సినిమా ఇది. ఈసారి మాత్రం రిలీజ్ పక్కా అని చిత్రబృందం చెబుతోంది. అలా… ‘కాంతార చాప్టర్ 1’తో మొదలైన అక్టోబరు ‘మాస్ జాతర’తో ముగియబోతోంది. ఈ నెలలో కనీసం రెండు సూపర్ హిట్లు చూసినా – టాలీవుడ్ కి అదే పది వేలు.