ఇంకొన్ని గంటల్లో జూలై నెల ముగుస్తుంది. ఈ నెల బాక్సాఫీసు లెక్క నీరసంగా ఉంది. తమ్ముడు ఫ్లాప్‌తో జూలై మొదటి వారం మొదలైంది. నితిన్ టైం బాలేదని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. చాలా నమ్మకంగా సినిమాని ప్రమోట్ చేశారు దిల్ రాజు. కానీ సిమిమ దారుణంగా దెబ్బతింది.
మొగలిరేకులు ఫేం ఆర్కే సాగర్ “ది 100” సినిమాతో వచ్చాడు. బాగానే ప్రమోట్ చేశాడు. మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఒక మంచి సందేశం ఉన్న కథే ఇది. కానీ జనం పట్టించుకోలేదు.
సుహాస్‌కు మరో ఫ్లాప్ తగిలింది. “ఓ భామా అయ్యో రామా” పల్టీ కొట్టింది. ‘వర్జిన్ బాయ్స్’ అనే మరో చిన్న సినిమా చిత్ర విచిత్ర విన్యాసాలతో ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించాలని చూశారు. కానీ ఆ చేష్టల్ని జనం చూడలేదు.
గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి ‘జూనియర్’ సినిమాతో వచ్చాడు. మంచి బ్యాకింగ్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రమోషన్స్ బాగానే పెట్టారు. కానీ కథ, కథనంలో దమ్ము లేకుండాపోయింది. డ్యాన్సులు, ఫైట్లు చేయగలడనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు కిరీటి.
ఇక ఎంతగానో ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” 24న వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్‌కి రావడం అంచనాలు మరింతగా పెంచింది. చాలా రోజులు తర్వాత ఫ్యాన్స్ షోల హంగామా కనిపించింది. కానీ కంటెంట్ మాత్రం నిరాశ పరిచింది. కథ ఉన్నప్పటికీ సినిమాని చిత్రీకరించిన తీరులో చాలా లోపాలు కనిపించాయి. గ్రాఫిక్స్‌పై విమర్శలు వచ్చాయి. మొత్తానికి వీరమల్లు ఆశించిన విజయం అందుకోలేకపోయింది.
జూలై మొత్తంగా చూసుకుంటే ఒక్క విజయం కూడా లేదు. మ్యాచ్ ఫలితం తేల్చడానికి చివరి బంతి మిగిలే వుందన్నట్లుగా.. జూలైలో మరొక్క డేట్ మిగిలింది. జూలై 31న విజయ్ దేవరకొండ “కింగ్డమ్” వస్తోంది. మంచి అంచనాలు ఉన్న సినిమా ఇది. సితార నాగవంశీ నిర్మాణం. “జెర్సీ” తర్వాత గౌతమ్ తిన్ననూరి చేస్తున్న సినిమా. ట్రైలర్ హైప్ క్రియేట్ చేసింది. ఈ విజయం ఈ జూలైకే కాదు, విజయ్‌కి చాలా కీలకం. కింగ్డమ్ బాక్సాఫీసు హిట్‌తో ఈ జూలైకి శుభం కార్డ్ పడాలనే కోరుకుందాం.