ఈనెల 24న బాక్సాఫీసుని షేక్ చేయబోవడానికి వస్తోంది OG. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే… మరే సినిమా…. పోటీ పడడానికి సిద్ధంగా లేదు. ఓజీ రావడానికి మరో పది రోజుల గ్యాప్ ఉంది. ఈలోగా ఈవారం మరో రెండు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఒకటి బ్యూటీ, మరోటి భద్రకాళి.
మారుతి ప్రోత్సాహంతో, ఆయన దిశానిర్దేశంలో తయారైన సినిమా ‘బ్యూటీ’. జీ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. తండ్రీ కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథ. యూత్‌కి కావాల్సిన అంశాలు మేళవించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. పాటలు జనంలోకి బాగానే వెళ్లాయి. ఈమధ్య లిటిల్ హార్ట్స్ అనే ఓ చిన్న సినిమా ప్రభంజనం సృష్టించింది. అదే ఊపు, ఉత్సాహం ఈ సినిమాకు కూడా ఉపయోగపడుతుందని చిత్రబృందం నమ్ముతోంది.
ఇక ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు ‘భద్రకాళి’ని రంగంలోకి దింపాడు. ఇదో పొలిటికల్ యాక్షన్ డ్రామా. విజయ్ సినిమాల్లో కథలు బలంగా ఉంటాయి. కొత్త పాయింట్లతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తాడు. తన సినిమాలు ఎప్పుడు బిచ్చగాడులా షాక్ ఇస్తాయో చెప్పలేం. కాబట్టి ఇండస్ట్రీ కూడా విజయ్ సినిమాలపై ఓ లుక్ వేస్తుంటుంది.
గత వారం విడుదలైన `మిరాయ్` జోరు ఈ వారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ ఫుట్ ఫాల్స్ ఇంకా మెరుగ్గానే ఉన్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ బృందం ప్రమోషన్లు ఇంకా చేస్తూనే ఉంది. ఓజీకి ముందు లిటిల్ హార్ట్స్, ‘మిరాయ్’ లాంటి సినిమాలు హిట్ అవ్వడంతో బాక్సాఫీసుకు కొత్త కళ వచ్చినట్టైంది. వచ్చేవారం ఓజీదే హావా. లిటిల్ హార్ట్స్ తో మొదలైన ఈ జోరు… ‘ఓజీ’తో హై పిచ్‌కి వెళ్లాలని చిత్రసీమ బలంగా కోరుకొంటోంది.