నిన్న రాత్రి మధ్యప్రదేశ్ లో హర్దా-ఖిర్కియా రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో కామయాని ఎక్స్ ప్రెస్, జనతా ఎక్స్ ప్రెస్ తాలూకు 15 మాచాక్ నదిలో పడిపోయాయని వచ్చిన వార్తలు నిజం కాదని రైల్వే శాఖ చైర్మన్ ఏ.కె మిట్టల్ చెప్పారు. నదికి కొంచెం ముందున్న ఒక కల్వర్టుపైకి నీళ్ళు రావడంతో పట్టాల క్రింద ఉన్న మట్టి, కంకర రాళ్ళు కొట్టుకు పోవడం చేత రెండు రైళ్ళు పట్టాలు తప్పి పక్కన నేలపైనే పడిపోయాయని తెలిపారు. కానీ ఆ సమయంలో కల్వర్టు క్రింద ప్రవహిస్తున్న నదిలో నీళ్ళు బోగీలలోకి చేరడంతో బోగీలు నదిలో పడిపోయాయని భావించిన ప్రయాణికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ వార్తలు వచ్చాయని అన్నారు. ప్రయాణికులలో గాయపడిన వారిని ఇటార్సీ మరియు చుట్టుపక్కల గల ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నామని, క్షేమంగా ఉన్న ప్రయానికులన్దరినీ వేరే రైళ్ళలో వారివారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకొంది. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.