హైకోర్ట్‌ విభజనపై ఇదీ కేసీఆర్ రహస్య ఎజెండా!

హైదరాబాద్: హైకోర్ట్ విభజనపై టీఆర్ఎస్ ఎంపీలు ఇటీవల ఉన్నట్టుండి ఆందోళనను ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు అక్కడి ప్రజలలో మద్దతు బాగా ఉంది కాబట్టి ఆ విషయంపై పార్లమెంట్‌లో, బయట పెద్ద గొడవ జరుగుతుండటాన్ని అర్థం చేసుకోవచ్చు. హైకోర్ట్ విభజనకోసం టీఆర్ఎస్ ఎంపీలుకూడా అదేస్థాయిలో పార్లమెంట్‌లో యాగీ చేయటం చాలామందికి అర్థంకావటంలేదు. హైకోర్టు విభజనజరగకపోతే కొంపలు మునిగిపోతాయన్నంతస్థాయిలో తెలంగాణలో ఎవరూ పెద్దగా బాధపడటంలేదు. మిగిలిన పార్టీలు అసలు ఈ అంశాన్ని పట్టించుకోవటమేలేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనిని తెలంగాణ సాధన ఉద్యమస్థాయిలో పరిగణించాలని అంటోంది. దీనికై ఆందోళనను ఉధృతం చేసింది. కోదండరామ్‌కూడా దీనికి మద్దతు ప్రకటించారు. మరి టీఆర్ఎస్ ఒక్కటే ఈ విషయంపై ఇంత రాద్ధాంతం చేయటం వెనక మతలబు ఏదైనా ఉందా…అంటే ఖచ్చితంగా ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురవుతూ వస్తోంది. ఈ జాబితాను ఒకసారి చూస్తే ఇది పెద్ద చాంతాడంత ఉంది. మచ్చుకు కొన్ని చూద్దాం.

1. ఎంసెట్ నోటిఫికేషన్
2. ఫాస్ట్ పథకం
3. తెలంగాణ అధికార చిహ్నం
4. సమగ్ర కుటుంబ సర్వే
5. మార్కెట్‌యార్డ్ కమిటీల రద్దు జీవో
6. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం
7. ఏపీనుంచి వచ్చే సరకు, రవాణా వాహనాలపై పన్ను విధింపు
8. ఏపీ పేరిట జారీచేసిన నంబర్ ప్లేట్‌లను మార్చుకోవాలన్న జీవో
9. జీహెచ్ఎమ్‌సీ ఎన్నికలు
10. 1,200మంది జెన్కో ఉద్యోగులను రిలీవ్ చేయటం

ఇలా కేసీఆర్ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు కొట్టివేయటంగానీ, స్టే ఇవ్వటంగానీ జరిగింది. ఈ స్థాయిలో, ఇన్ని విషయాలలో ఒక రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలలో ఎదురుదెబ్బలు తినటం బహుశా దేశచరిత్రలోనే ఇది మొదటిసారి అయిఉండొచ్చు…అదీ ఇంత స్వల్పకాలంలో. ముఖ్యంగా ఫాస్ట్ పథకం, ఎంసెట్ కౌన్సిలింగ్ విషయాలలో కోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. గతంలో ఉన్న ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను రద్దుచేసి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు లబ్దిపొందకుండా ఉండేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకాన్ని హైకోర్ట్ తీవ్రంగా అభిశంసించింది. ఫాస్ట్ పథకం జీవో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించేలా ఉందని, ఇలా చేయటంవల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో అడ్మిషన్‌లు తీసుకోరని వ్యాఖ్యానించింది. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీమ్ కోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓటుకు నోటు కేసులో బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అదే వ్యవహారంపై ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెళ్ళి సుప్రసిద్ధ న్యాయవాది కపిల్ సిబల్‌తో వాదింపజేసినా అక్కడా చుక్కెదురు. అన్నట్లు సుప్రీమ్ కోర్టులో చుక్కెదురు కావటం ఇదే మొదలుకాదు. ఎమ్‌సెట్ కౌన్సిలింగ్ విషయంలోనూ టి ప్రభుత్వానికి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది.

అసలు ఇప్పుడు దేనికోసమైతే టీఆర్ఎస్ ఇంత గొడవ చేస్తోందో, ఆ హైకోర్టు విభజన విషయంలోకూడా హైకోర్టులో చుక్కెదురు కావటం మరో విశేషం. ఉమ్మడి హైకోర్ట్ విభజనపై దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్ట్ ఉమ్మడి హైకోర్ట్‌ను ఇప్పట్లో విభజించేందుకు వీల్లేదని తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో కొత్త భవనం నిర్మించిన తర్వాత మాత్రమే ఈ విభజన జరగాలని స్పష్టం చేసింది. ప్రత్యేకకోర్ట్‌ ఏర్పాటు చేసుకునే అధికారం తెలంగాణ రాష్ట్రానికి లేదనికూడా పేర్కొంది.

ఈ పరిణామాలతోనే టీఆర్ఎస్ పార్టీ హైకోర్టు విభజనపై ఉద్యమానికి దిగింది. హైకోర్టు విభజన జరగకపోతే న్యాయస్థానాలలో ముందుముందుకూడా తమకు ఇలా ఎదురుదెబ్బలు తప్పవనే ఉద్దేశ్యంతో రంగంలోకి దూకింది. ముందు టీఆర్ఎస్ ఎంపీలు గవర్నర్ నరసింహన్‌‍ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంనుంచీ, సభలోపలో, బయటో దీనిపై ఆందోళన చేయటం మొదలుపెట్టారు. నిన్న టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడుతూ, ఉమ్మడి హైకోర్టులో ఉన్న 29మంది న్యాయమూర్తులలో 25మంది సీమాంధ్రకు చెందినవారే ఉన్నారని, తెలంగాణకు న్యాయం జరగటంలేదని ఆరోపించారు. ఇవాళ నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు ద్వారా తెలంగాణపై అజమాయిషీ చేస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సభలోని వ్యక్తులపై ఆరోపణలు చేయగూడదని, కవిత వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయని అన్నారు. మరోవైపు కేంద్ర న్యాయశాఖమంత్రి సదానంద గౌడ ఇవాళ ఈ అంశంపై స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, ఏపీకి కొత్త హైకోర్టును త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశామని తెలిపారు. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందని, ఇది న్యాయస్థానాల పరిధిలోఉందికాబట్టి ఇంతకంటే తాను ఎక్కువ మాట్లాడనని చెప్పారు. అయితే టీఆర్ఎస్ ఎంపీలు ఈ సమాధానంపై సంతృప్తి చెందలేదు. సదానంద ప్రకటనలో కొత్తదేమీ లేదని జితేందర్ రెడ్డి అంటున్నారు. మొత్తంమీద హైకోర్టు విభజనపై కేంద్రప్రభుత్వంలో చురుకు పుట్టించటంలో టీఆర్ఎస్ ఎంపీలు కృతకృత్యులయ్యారని చెప్పాలి. అయితే ఇది వారి లక్ష్యసాధనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచిచూడాలి.

న్యాయస్థానాలలో తమకు ఎదురుదెబ్బలు తగలడానికి కారణం హైకోర్ట్ విభజన జరగకపోవటం అని, ఉమ్మడి హైకోర్టులో ఇప్పుడున్న న్యాయమూర్తులలో ఎక్కువమంది సీమాంధ్రవారేనని టీఆర్ఎస్ చేస్తున్న వాదనలో ఎంతవరకు ఔచిత్యముందోగానీ ఈ ఎదురుదెబ్బలు తగిలిన అంశాలలో – ఉద్వేగపూరితంగానో, సెంటిమెంట్‌పరంగానో అనాలోచితంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలుకూడా ఉన్నాయనేది వాస్తవం. టీఆర్ఎస్ నాయకత్వం దానిని కన్వీనియంట్‌గా మరిచిపోయి హైకోర్ట్ విభజనపై ఉద్యమిస్తోంది. తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్ట్ వచ్చిన తర్వాత తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆత్మపరిశీలన చేసుకుని ఇకనైనా నిర్ణయాలు తీసుకునేముందు అన్నివైపులా ఆలోచించి, నలుగురినీ సంప్రదిస్తూ ఉంటే కేసీఆర్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకూ కూడా క్షేమం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుబ్రహ్మణ్య.. ఏదో గట్టి ప్లానే

రవిశంకర్ ఆల్ రౌండర్. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డైరెక్షన్ ఇలా పలు విభాగాల్లో ఆయనకి ప్రతిభ వుంది. ఇప్పుడు ఆయన తనయుడు అద్వాయ్ ని తెరకి పరిచయం చేస్తున్నారు. స్వయంగా రవిశంకర్ దర్శకత్వం...

మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తులా… రేవంత్ స‌ర్కార్ కు తెల్ల‌రేష‌న్ కార్డులిచ్చే ఆలోచ‌న ఉందా?

తెలంగాణ‌లో తెల్ల రేష‌న్ కార్డుల సంగ‌తి రేపు మా ఇంట్లో ల‌డ్డూల భోజ‌నం క‌థ‌లా మారింది. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కొత్త కార్డుల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురు చూశాయి. పెళ్లిళ్లు అయి,...

జానీ మాస్ట‌ర్ స‌స్పెండ్… వైసీపీకి జ‌న‌సేన‌కు ఇదీ తేడా!

రాజ‌కీయాల్లో మార్పుల‌కు శ్రీ‌కారం చుడుతాం అంటూ ప్ర‌క‌టించే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్... త‌ను చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై వేధింపుల విష‌యంలో పార్టీ...

మల్లాది మౌనం..జంపింగ్ కోసమేనా?

వైసీపీ సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్ లో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అధికారం ఉన్నన్నాళ్లు లౌడ్ స్పీకర్ లాగా చెలరేగిపోయిన సీనియర్లు.. అధికారం కోల్పోయాక కిక్కురుమనడం లేదు. వైసీపీ అనుకూల మీడియాలో తరుచుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close