సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవాత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ పాల్ రెడ్డి నిర్మించారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 22న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ ఆవిష్కరించారు.
3 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ట్రైలర్ ఇది. అన్ని పాత్రలూ, వాటి కథలూ, ఆ పాత్రల చుట్టూ అల్లిన భావోద్వేగాలూ ఇవన్నీ మూడు నిమిషాల ట్రైలర్లో చూపించగలిగారు. సత్యరాజ్ పాత్ర చాలా ఆసక్తికరంగా సాగింది. ‘ఓ తోటమాలి.. గులాబీ మొక్క’ అంటూ సత్యం రాజేష్ ఇచ్చిన వాయిస్ ఓవర్లో.. ఈ కథ సారం దాగుందనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఉదయభానుని ఓ సర్ప్రైజింగ్ ప్యాకేజీ అనుకోవాలి. చాలా కాలం తరవాత ఆమె స్క్రీన్ పై కనిపించారు. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారన్న సంగతి అర్థమవుతోంది.
ఈమధ్య కాలంలో ఈ జోనర్లో ‘మహారాజా’ సినిమా వచ్చింది. విజయ్ సేతుపతి నటించిన ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. అదే ఫీల్.. ఈ ట్రైలర్ చూసినప్పుడు కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేకింగ్ లో క్వాలిటీ కనిపించింది. నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అంత కంటెంట్ కూడా కథలో ఉందన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.