ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావేమయ్యా…రంగనాథ్

నివాళి

రంగనాథ్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, తన జీవిత కథ ఇలా అర్థాంతరంగా ముగింపు చెప్పుకుంటారని ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమాల్లో `ట్విస్ట్’ లాంటిదే రంగనాథ్ అనుమానాస్పద మరణం. ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావేమయ్యా…మేము తట్టుకోలేకపోతున్నాం. సికింద్రాబాద్ కవాడీగూడలో తన ఇంటి వంటగదిలో ఉరివేసుకుని మరణించారన్న వార్త వినగానే గుండె బరువెక్కింది. ఆయన తన మృత్యుగీతికను తానే రాసుకున్నట్లనిపించింది. రంగనాధ్ పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల అంతగా మధనపడుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన హృదయంలో నిరంతర సంఘర్షణ సాగరమధనంలా సాగుతుండేది. అటు నటజీవితంలోనూ, ఇటు నిజజీవితంలోనూ ఎన్నో వొడుదుడుకులు ఎదుర్కున్న నిండుకుండ రంగనాథ్.

రంగనాథ్ నుంచి నేటి సినీనటులంతా ఒక పాఠం నేర్చుకోవాలి. ఆయన హీరోగా చేసింది చాలా తక్కువ. విభిన్న పాత్రలను ఆయనెక్కువగా పోషించారు. అయితే, `మీరు హీరోగా వేయడంలేదుకదా , మరి ఎలా ఫీలవుతున్నార’ని ప్రశ్నిస్తే, నవ్వేస్తూ – `నిజానికి ఇప్పటికీ నేను హీరోనే. నాలోని హీరోనే నాచేత ఇన్ని పాత్రలు వేయిస్తున్నాడు’ అన్నారు. ఏపాత్ర వేసినా అందులో హీరోయిజం ప్రదర్శించడం ఒక గొప్ప నటునికి ఉండాల్సిన లక్షణం. ఎన్టీఆర్, ఎస్వీరంగారావు వంటి మహానటుల తర్వాత రంగనాథ్ ఈ లక్షణాన్ని సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, ఎస్వీఆర్ సినిమాలు చూస్తూ పెరిగారు. నటనకు వారే ప్రేరణ అంటారు. రావణాసురుడి పాత్ర పోషించాలనుకున్నారు. కానీ అవకాశం రాలేదు. విలన్ పాత్ర పోషిస్తున్నా అందులో దర్పం, హీరోయిజం కనబడాలన్న తత్వాన్ని బాగా ఒంటపట్టించుకున్న నటుడు రంగనాథ్.

రంగనాథ్ కి మొహమాటం ఎక్కువ. సినిమా ఛాన్స్ లకోసం ఆయన ఎవరినైనా అడగాలంటే చాలా ఇబ్బంది పడేవారు. కానీ, అభిమానుల ఒత్తిడితో తన పాలసీని మార్చుకుని తననుతాను ప్రమోట్ చేయడం నేర్చుకున్నాడు. దీని గురించి ఒక టివీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబ్తూ – `నేను అనే ఈ శరీరాన్ని రంగనాథ్ గా అంతా అనుకుంటున్నారు. ఈ నేనుకు ఎవ్వరినీ అడిగే తత్వంలేదు. కానీ నాలో నటుడు ఉన్నాడు. వాడు ఎదగాలి. అంటే ఈ నేను అనేవాడ్ని ఆర్టిస్ట్ రంగనాథ్ కు సెక్రెటరీగా పనిచేయాల్సిందే..’ అంటూ ఎంతో భావుకతతో వాస్తవజీవిత పాఠాన్ని ఆవిష్కరించారు. రంగనాథ్ కు దైవచింతన ఎక్కువ. జీవితం మన చేతుల్లో లేదు, దైవ నిర్ణయాన్నిబట్టి నడుచుకోవడమే మనం చేయగలిగిందని అంటుండేవారు.

యువకునిగా ఉన్నప్పుడోసారి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. రంగనాధ్ కు ఓ మంచి మిత్రుడు (నందా) ఉండేవాడు. అతను దూరమయ్యేసరికి ఆ బాధలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. రైలుపట్టాలమీద కూర్చున్నారు. కానీ రైలు రావడం ఆలస్యమైంది. ఈలోగా జీవితంమంటే అవగాహన ఏర్పడింది. `ఆర్టిస్ట్ కావాలని అమ్మ కోరుకుంటే, నేను ఇలా చచ్చిపోవాలనుకోవడమేమిటి?’ అన్న సంఘర్షణ మొలకెత్తింది. అంతే, ఆ ప్రయత్నం మానుకున్నారు. కానీ చివరకు ఒంటరితనం భరించలేక, డిప్రెషన్ కు గురై జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేయడం అందర్నీ కలచివేసింది.

రంగనాథ్ లో ఉరకలెత్తే భావుకత్వం ఉండేది. యువకునిగా ఉన్నప్పుడు కేఆర్ విజయకు మంచి అభిమాని. ఆమె నవ్వుపై చక్కటి కవిత్వం రాశారు. స్కూల్ కు వెళ్ళే రోజుల్లోనే తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చేవారు. రంగనాథ్ అంటే ఈ తరంవాళ్లు సీనియర్ క్యారెక్టర్ యాక్టర్ అని చెబుతారు. కానీ మూడుదశాబ్దాల క్రిందట ఇదే ప్రశ్న వేస్తే, ఆయనో రొమాంటిక్ హీరో అనేవారు.

రంగనాథ్ 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఈయన పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1949 జూలైలో మద్రాసులో పుట్టారు. వీరి అమ్మవైపు తాతగారు మందాసా మహారాజు ఎస్టేట్ లో వైద్యునిగా ఉండేవారు. తాతగారింట్లోనే రంగనాథ్ పెరిగారు. రంగనాథ్ నటించిన సినిమాల్లో `చదువు సంస్కారం’, `లవ్ ఇన్ సింగపూర్’, `ఖైదీ’, `కొదమసింహం’, `అడవి దొంగ’, `విజేత’, `ప్రేమంటే ఇదేరా’, `కలిసుందాం రా’, `ఎదురులేని మనిషి’, `దేవతలారా దీవించండి’ వంటివి ఉన్నాయి.

జీవితమే ఓ వైకుంఠపాళి అంటుండే రంగనాథ్ చివరకు ఇలా ఆకస్మికంగా మృత్యునాగు పాలిట పడటం మన దురదృష్టం. మహామేధావి రంగనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయనకు telugu360.com శ్రద్ధాంజలి ఘటిస్తోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close