భళిభళి, బాగున్నదయా నీ పాట…

(మాధవపెద్ది సత్యం 15వ వర్ధంతి సందర్బంగా నివాళి)

హాల్లో మాయాబజార్ చిత్రం నడుస్తోంది. కథ వేగంగా పరిగెడుతోంది. ఇంకా ఘటోత్కచుడు సీన్లోకి రాలేదు. అన్న బలరాముడిమీద అలిగిన సుభద్రనీ అతని కుమారుడైన అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎంతో చాకచక్యంగా శాంతింపజేసి వారిని రథమెక్కిస్తాడు. రథం నడిపే దారుకునికి మార్గనిర్దేశం చేస్తాడు. ఆ వెంటనే రథం పాండవులున్న చోటకు కాకుండా ఘటోత్కచుని ఆశ్రమంవైపు సాగిపోతుంటోంది. భగవంతుడు చేసిన మార్గనిర్దేశం ఇది. అందుకే దారుకుడు రథాన్ని వేగంగా నడుపుతూనే శ్రీకృష్ణ లీలలను కొనియాడుతూ `భళిభళి, దేవా… బాగున్నదయా నీ మాయ…’ అన్న తత్వాన్ని పాటగా పాడుకుంటూ సాగిపోతుంటాడు. ఈ పాట పాడింది మాధవపెద్ది సత్యంగారు. అంతేకాదు, ఆ దారుకునిగా నటించింది కూడా ఆయనే. ఇదే సినిమాలో ఎస్వీరంగారావు నటించిన పాత్ర (ఘటోత్కచుడు)కోసం హాలంతా మారుమ్రోగేలా అద్భుతమైన గీతాన్ని (వివాహ భోజనంబు, వింతైన వంటకంబు) హావభావాలను, వికటాట్టహాసాన్ని స్వరంలో పలికిస్తూ పాడింది కూడా మాధవపెద్ది సత్యంగారే. ఈ కంఠం వింటున్నప్పుడు పాడిన వ్యక్తి కూడా ఎస్వీఆర్ లాగా బాగా పుష్టిగా లావుగా ఉంటాడని సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో చాలామంది అనుకున్నవాళ్లట. కానీ నిజానికి అలా పాడిన మాధవపెద్ది సత్యం ఆకారం అందుకు విరుద్ధం. ఆయన బక్కబలచగా, పొడుగ్గా (5 అడుగుల 10 అంగుళాలు – ఆజానుబాహునిగా) ఉండే వారు. కానీ కంఠం విప్పి పాడటం మొదలుపెడితే, మైకులూ గట్రా లేకుండానే చాలాదూరం వినిపించేది.

పాండవ వనవాసం సినిమాలో ధుర్యోధన పాత్రకోసం మాధవపెద్ది ఆలపించిన `కారున్ కూతలు కూయబోకుమిక గర్వాంధా ‘ పద్యం ఓ చక్కని ఉదాహరణ. బహుశా ఈ గంభీరమైన కంఠం మాధవపెద్ది వెంకట్రామయ్యగారు వంటి ఆంగిక.వాచికాభినయ నిష్ణాతులు జన్మించిన కుటుంబంలో పుట్టడం వల్లనే సంప్రాప్తించిందేమో. మాధవపెద్ది 30ఏళ్లుదాటని వయసులో ఉన్నప్పుడు సినీవిమర్శకులు ఆయన గురించి రాస్తూ, మంచి నటన,గాత్రం ఉన్నప్పటికీ, ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నదని హెచ్చరిస్తూ మరోపక్క ఇతగాడు మంచి దర్శకుల చేతుల్లో పడితే శృంగార గీతాలను కూడా బాగానే పాడతాడని కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి.

సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ కు వీరు బాబాయి అవుతారు. మాధవపెద్ది నాగేశ్వరరావుగారు సురేష్ తండ్రిగారు. మాధవపెద్ది సత్యం నేపథ్య గాయకులేకాదు, రంగస్థల నటులు కూడా. ఇటు గాత్రం, అటు నటనానుభవం ఉండబట్టే ఆయన కొన్ని సినిమాల్లో పాడుతూ నటించారు. సినిమాల్లో రాకముందు హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడంటే మాధవపెద్ది వేయాల్సిందేనన్న క్రెడిట్ నాటక సమాజాల దగ్గర్నుంచి కొట్టేశారు.

మాధవపెద్ది 1922 మే 11న బాపట్ల దగ్గర్లోని బ్రాహ్మణ కోడూరులో జన్మించారు. 78ఏళ్ల వయసులో కనుమూశారు. ఈయన తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషల్లో కలిపి ఏడువేలకు పైగానే పాటలు పాడారు. నాటకానుభవమే అతనికి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేలా చేసింది. అది కూడా చక్రపాణి కంటపడటం వల్ల. ఆ తర్వాత మద్రాసువెళ్ళి నాగిరెడ్డిని మెప్పించడంతో అతని దశ తిరిగిపోయింది. అప్పడే కొత్తగా స్థాపించిన విజయాసంస్థవాళ్లు ఆరోజుల్లో తీసిన `షావుకారు’ చిత్రంలో నటించే అవకాశంతోపాటుగా మూడు పాటలు పాడే అవకాశమిచ్చారు. అందులో ఈయనది గుడ్డివాని పాత్ర. తత్వగీతాలు పాడుకునే నైజం ఉన్న పాత్ర ఇది.

అవును, మరిచాను, మాధవపెద్ది పాడిన మంచిపాటల ఖాతాలో ఓ సరదా పాట కూడా ఈ సందర్బంగా గుర్తుచేస్తాను. అదే – `అయ్యయో, జేబులో డబ్బులు పోయెనే…’ . ఈ పాటను మాధవపెద్దిగారిని తలుచుకునేటప్పుడు తప్పనిసరిగా వినితీరవలసిందేమరి. ఎస్వీరంగారావు నటించిన చిత్రాల్లో ఆయనకు నేపథ్య గాయకునిగా మాధవపెద్దే ఎక్కువగా ఉండేవారు. మాధవపెద్ది పద్యం పాడుతున్నారంటే, తెరపై ఎస్వీరంగారావు కనబడాల్సిందే అన్నంతగా వీరిద్ధరి మధ్య తెరానుబంధం ఏర్పడింది. ఈయన ఆనాటి ప్రసి ద్ధ సంగీత దర్శకులైన సాలూరు రాజేశ్వ రరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో కలసి పనిచేశారు. ఎస్వీ రంగారావు , రేలంగిలకు దాదాపుగా మాధవపెద్దే పాడేవారు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటంలో ప్రసిద్ధి చెందారు. ఒక దశలో పౌరాణిక చిత్రం వచ్చిందంటే తెరమీద ఎన్టీఆర్- ఎస్వీరంగారావు, నేపథ్య గానంలో ఘంటసాల- మాధవపెద్ది కాంబినేషన్ ఉండాల్సింది. ఇందులో తేడావస్తే ఆ పౌరాణిక చిత్రాన్ని, అందులోని పద్యాలను ప్రేక్షకులు ఆదరించేవారుకారు.

మరో విశేషం- మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరావులది ఓ మంచి జోడి. ఇందాక చెప్పిన పాట (`అయ్యయో, జేబులో..’) వీరిద్దరూ కలిసిపాడిందే. జీవన చరమాంకంలో, 75ఏళ్ల వయసులో కూడా ఆయన `సింధూరం’ సినిమాలో `సంకురాతిరి పండగొచ్చెరో..’ అన్న పాటపాడి ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం సంగీత ప్రపంచంలో బాబాయి – అబ్బాయిల్లో ఒకరైన సురేష్ – మాధవపెద్ది అనే సంగీత వటవృక్షాన్ని చెక్కుచెదరకుండా పదిలంగా చూసుకుంటున్నారు.

చివరగా, `సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం’ అన్న ప్రకటనను గుర్తుచేసుకుంటూనే – `సరదా సరదా సిగిరెట్టూ, ఇది దొరలు తాగు బల్ సిగిరెట్టూ….’ అన్న పాట (రాముడు భీముడు చిత్రం) వింటూ మాధవపెద్ది సత్యం గారిని ఈ 15వ వర్ధంతి సందర్బంగా స్మరించుకుందాం.. 2000 సంవత్సరం డిసెంబర్ 18న స్వర్గస్థులైన ఆ మహాగాయకునికి `telugu360.com’ నివాళులర్పిస్తోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com