పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో త్రివిక్రమ్ ‘నీడ’ దానిపై పడడం కొన్నాళ్ల నుంచీ గమనిస్తూనే ఉన్నారంతా. ఇద్దరూ మంచి స్నేహితులు కాబట్టి, ఈ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు కూడా లేవు. అయితే ‘హరి హర వీరమల్లు’ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ ముందు నుంచీ దూరంగానే ఉన్నారు. ఆ సమయంలో త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల, ‘వీరమల్లు’ సినిమా విషయంలో అస్సలు జోక్యం చేసుకోలేదు. అయితే.. ఇప్పుడు ‘వీరమల్లు’ చివరి దశకు చేరుకొంది. ఇలాంటి దశలో త్రివిక్రమ్ తన వంతు సాయం చేస్తున్నారు. ‘వీరమల్లు’ చివరి రెండు రోజుల షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తయ్యింది. పవన్ కల్యాణ్ షూటింగ్లో పాల్గొని, సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. ఆ రెండు రోజులూ సెట్లో త్రివిక్రమ్ ఉన్నారు. ఓరకంగా.. దర్శకత్వ పర్యవేక్షణ చేశారని ఇన్ సైడ్ వర్గాల టాక్. సినిమాని క్రిష్ 80 శాతం పూర్తి చేశారు. జ్యోతికృష్ణ మిగిలిన సినిమా బాధ్యత భుజాన వేసుకొన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ చివర్లో సాయం పట్టారు. అలా ఈ సినిమాకు ముగ్గురు దర్శకులయ్యారు.
ఏ సినిమా ఆలస్యం అయినా, దానిపై బజ్ తగ్గడం ఓ ఆనవాయితీ. ‘వీరమల్లు’ ఇంత ఆలస్యమైనా, దానిపై అభిమానులు ఫోకస్డ్ గానే ఉన్నారు. దానికి కారణం.. అది పవన్ సినిమా కాబట్టి. పవన్ మంత్రి అయ్యాక, విడుదల అవుతున్న సినిమా ఇది. కాబట్టి అభిమానులకు స్పెషలే. కాకపోతే అవుట్ పుట్ పై పెద్దగా ఎవరికీ నమ్మకాల్లేవు. ఇలాంటి దశలో త్రివిక్రమ్ ‘భాగం’ పంచుకోవడం వ్యక్తిగతంగా త్రివిక్రమ్ కు తలనొప్పి వ్యవహారమే. ఫలితం తేడా వస్తే.. అంతో ఇంతో ఆ బాధ్యత ఇప్పుడు త్రివిక్రమ్ కూడా మొయాల్సివస్తుంది. ట్రైలర్ కట్ లోనూ, సినిమా ప్రమోషన్ విషయంలోనూ ఇప్పుడు త్రివిక్రమ్ జోక్యం చేసుకొనే అవకాశం ఉంది. ఓ వైపు బన్నీ కథని పూర్తి చేస్తున్నారు త్రివిక్రమ్, మరోవైపు వెంకటేష్ స్క్రిప్టు లో తనలమునకలై ఉన్నారు. ఇంత బిజీలోనూ పవన్ కోసం ఆయన సమయం వెచ్చించడం త్రివిక్రమ్ లోని స్నేహ ధర్మానికి అద్దం పడుతుంది. పవన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఓజీ, ఉస్తాద్ చిత్రాలకు ఆయన డేట్లు సర్దుబాటు చేయాలి. ఈ రెండు సినిమాలూ అయిపోతే పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టొచ్చు. కాబట్టి ఈ రెండు సినిమాల ప్లానింగూ.. త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకొనే అవకాశాలున్నాయి.