వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్సవగానే ఇదో ఫ్యామిలీ డ్రామా అనుకొన్నారు. ఈ సినిమా టైటిల్స్ కూడా చాలానే లీక్ అయ్యాయి. ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ గట్టిగా వినిపించింది. ఈ టైటిల్ అందరికీ నచ్చింది కూడా. దాన్నే ఫిక్స్ చేస్తారనుకొన్నారంతా. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ప్రకటించాడు. దాంతో పాటు వెంకీ ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చేసింది.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వుంది. ఇంటి నెంబరు 47…. AK47 అనే ట్యాగ్ లైన్, టైటిల్ లోగో డిజైన్ చూస్తుంటే కచ్చితంగా ఈ కథలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించినట్టు అర్థం అవుతోంది. ‘అ’ సెంటిమెంట్ వదలకపోయినా – గురూజీ మాత్రం ఈసారి జోనర్ మార్చారు… అనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. అంటే… మార్చి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలన్న మాట. చేతిలో 4 నెలల సమయం మాత్రమే వుంది. త్రివిక్రమ్ జెట్ స్పీడ్ లో షూట్ చేయాల్సిందే. ఈ సినిమా కోసం ఓ ఇంటి సెట్ ని హైదరాబాద్ లో తీర్చిదిద్దారు. అందులోనే సింహభాగం షూటింగ్ జరుపుతారు.
