‘వార్ 2’ ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి నిర్మాత నాగవంశీపై పడింది. వార్ 2కి ఆయన నిర్మాత కాదు. తెలుగులో ఈ సినిమా హక్కులు కొని రిలీజ్ చేస్తారంతే. ఓ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ హీరోమీద పడతారు.లేదంటే.. దర్శకుడ్ని ఆడుకొంటారు. కానీ నాగవంశీ వరకూ వచ్చేసరికి మాత్రం తనే టార్గెట్ అయిపోతాడు. ‘వార్ 2’ కంటెంట్ తో నాగవంశీకి సంబంధం లేదు. సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు వరకూ కూడా ‘వార్ 2’ సినిమాని నాగవంశీ చూడలేదు. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన సినిమాని కొన్నారంతే. కానీ ఫ్యాన్స్ మాత్రం నాగవంశీని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకొంటున్నారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగవంశీ ఇచ్చిన స్పీచ్ హైలెట్ అయ్యింది. రిలీజ్ తరవాత అదే ట్రోలింగ్ కంటెంట్ గా మారిపోయింది. బాలీవుడ్ కంటే ఒక్క రూపాయైనా షేర్ ఎక్కువ ఇవ్వాలన్న మాట.. ట్రోలర్స్ చేతిలో పాసుపతాస్త్రం అయ్యింది. ఈ సినిమా విడుదలైన వెంటనే నాగవంశీ దుబాయ్ వెళ్లిపోయాడన్న వార్త బయటకు రావడంతో.. అజ్ఞాతవాసి, దుబాయ్ శీను పేరుతో నాగవంశీ పై పోస్టర్లు రెడీ చేసి వదులుతున్నారు. కొంత కాలం వరకూ మీడియా ముందుకు రావడం ఇష్టం లేకే తన తాజా సినిమా ‘మాస్ జాతర’ కూడా వాయిదా వేసుకొన్నాడన్న వార్తలు వినవస్తున్నాయి.
నిజంగా ‘వార్ 2’కి నాగవంశీనే నిర్మాత అయినా ఇంత ట్రోలింగ్ ఉండేది కాదేమో? ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో.. మితిమీరిన ఎలివేషన్లు ఇస్తే – పరిస్థితి ఇలానే ఉంటుంది. కూలీ, ‘వార్ 2’ రెండూ ఒకే తానులో ముక్కలే. రెండింటి ఫలితాలూ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. అయితే.. ‘వార్ 2’కే ఎక్కువ ట్రోలింగ్ జరుగుతోంది. ఓ సినిమా, అందులోనూ స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంటే… నిర్మాతలు, దర్శకులు ఇచ్చే స్పీచులు ఎంత కంట్రోల్డ్ గా ఉండాలన్న విషయం ఈ ఉదంతం మరోసారి ఓ పాఠంలా వివరిస్తుంది.